KCR- Yagam beofre cabinet expansionతెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలన్నర కావొస్తున్నా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ జరగలేదు. కేసీఆర్ తో పాటు కేబినెట్ లో ప్రస్తుతానికి ఉన్నది మహమూద్ అలీ ఒక్కరే. దీనితో పాలన కుంటుపడి అన్ని డిపార్టుమెంట్లలో ఫైళ్లు గుట్టలకొద్దీ పేరుకుపోయాయట. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10న గానీ కేబినెట్ విస్తరణ జరగదని సమాచారం. అంటే దాదాపుగా ఫలితాలు వచ్చిన 63 రోజులకు గానీ పూర్తిస్థాయిలో కాబినెట్ ఉండదు.

కాగా కేబినెట్ విస్తరణ మాట ఎలా ఉన్నా ఈలోగానే ఇంకో హోమం చెయ్యడానికి సిద్ధం అవుతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన నిర్వహించనున్న మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగానికి సర్వం సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలో సీఎం వ్యవసాయ క్షేత్రంలో యాగానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. యాగశాల పనులను శారదా పీఠం వేద బ్రాహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించాలని పండితులు నిర్ణయించారు.

శృంగేరి పీఠం, కర్ణాటక నుంచి సుమారు 200 రుత్వికులు శనివారం వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. వారితో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది వేద పండితులు యాగంలో పాల్గొననున్నట్లు సమాచారం. మీడియాకు అనుమతి ఉండదని సమాచారం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ కూడా చెయ్యకుండా ఇలా ఐదు రోజుల పాటు యాగం తలపెడితే సహజంగా చాలా వ్యతిరేకత వస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణకు కేసీఆర్ మకుటం లేని మహారాజు.

మరో ఐదేళ్ళ పాటు ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వడంతో ఆయనను ప్రశ్నించే సాహసం అటు మీడియా గానీ ఇటు ప్రతిపక్షాలు గానీ చెయ్యవు. చేస్తే ఏమవుతుందో ఆయన గతంలోనే చేసి చూపించారు. దీనితో కేసీఆర్ ఆయనకు తోచిన విధంగా చేసుకుంటూ పోతున్నారు.ఒకప్పుడు కేసీఆర్ ఆంటే ఒంటి కాలి మీద లేచే వంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి వారు కూడా సాహో అనడం మనం చూశాం. ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చూశాకా ఫెడరల్ ఫ్రంట్ టూర్లని, యాగం అని ఆయనకు తోచినట్టు కాలం గడుపుతున్నారు.