KCR - Narendra Modiతెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ పేరిట కొందరు నాయకులను కలుస్తున్నారు. మొన్న ఆ మధ్య ఆయన కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినారయి విజయన్ ను కలిసొచ్చారు. విజయన్ సిపిఐ (ఎం) కు చెందిన నేత. అయితే కేసీఆర్ ను నమ్మడానికి లేదని మరో వామపక్ష పార్టీ సీనియర్ నేత సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అంటున్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లపాటు బీజేపీకి కేసీఆర్‌ మద్దతు ఇస్తూ వచ్చారని ఆయన గుర్తు చేశారు.

ఇప్పటికీ కేసీఆర్ బీజేపీ కోసమే పని చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీయేలోని ఏ ఒక్క పార్టీతోనూ తమ ఫెడరల్ ఫ్రంట్ లోకి రమ్మని కేసీఆర్‌ సంప్రదింపులు జరపలేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలు కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తమకు ఇబ్బంది లేదన్న సురవరం.. బీజేపీ లేదా కాంగ్రెస్‌ మద్దలు లేకుండా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. ఒకరకంగా సురవరం చెప్పిన మాటలో కూడా కొంత మేర వాస్తవం ఉందనే చెప్పుకోవాలి.

కేసీఆర్ ఇప్పటివరకు కాంగ్రెస్ మిత్రులనే కలుస్తున్నారు. ఏకంగా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్న డీఎంకే, జేడీఎస్ పార్టీలతో కూడా చర్చలు జరిపారు. కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీలు కలిసి కర్ణాటకలో ప్రభుత్వం నడుపుతున్నాయి. ఇటువంటి సమయంలో వారితో మంతనాలు జరపడం కూడా చాలా మంది తప్పు పట్టారు. ఒకదశలో డీఎంకే అధినేత స్టాలిన్ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి మీతో మాట్లాడటం భావ్యం కాదు అని అప్పాయింట్మెంట్ నిరాకరించినా కేసీఆర్ పట్టుబట్టి వెళ్లి కలిసొచ్చారు. మరి ఈ అభియోగాలపై కేసీఆర్ ఏమంటారో?