KCR who Killed TDP Party in Telangana Giving Life Againరాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకొన్నప్పుడు సిఎం కేసీఆర్‌ దానిని ‘ఆంధ్రా పార్టీ’ అని, దానిలో నేతలని ‘ఆంద్రా వాళ్ళు’ అని అనుకోలేదు. అనుకొని ఉండి ఉంటే తలసాని, ఎర్రబెల్లి వంటి అనేకమంది టిడిపి నేతలను టిఆర్ఎస్‌లో చేర్చుకొనేవారేకారు కదా? కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలలో పాల్గొనాలనుకొంటే మాత్రం తలసానితో సహా టిఆర్ఎస్‌ నేతలందరూ “మళ్ళీ వలస నాయకులు తెలంగాణ మీద కన్నేశారు. కుట్రలు, కుతంత్రాలతో స్వపరిపాలనలో సాగుతున్న తెలంగాణలో చిచ్చు రగిలించేందుకు వస్తున్నారు,” అంటూ విషం కక్కడం మొదలుపెడతారు. వారి ఉద్దేశ్యంలో స్వపరిపాలన అంటే టిఆర్ఎస్‌ పాలన అనే తప్ప తెలంగాణకు చెందిన పార్టీలలో ఏదో ఓ పార్టీ పాలన అని కాదు. అంటే తెలంగాణలో ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలని, తమ అధికారాన్ని ఎవరూ సవాల్ చేయకూడదని టిఆర్ఎస్‌ అధినేత కోరుకొంటున్నారని ఎప్పుడో విస్పష్టంగా చెప్పారు. కనుక తెలంగాణలో టిడిపి జెండా మళ్ళీ కనబడితే టిఆర్ఎస్‌కు చాలా అసహనం, ఆగ్రహం కలుగుతుంటుంది.

అందుకే టిడిపి మునుగోడు ఉపఎన్నికలలో టిడిపి పోటీ చేయాలనుకొన్నా సమస్యే, పోటీ నుంచి విరమించుకొన్నా వారికి సమస్యే! తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు వేలుపెడుతున్నారంటూ సొంత బాకా మీడియాతో అడిగిస్తుంటారు. అయితే టిఆర్ఎస్‌కు కోరుకొన్న సమాధానాన్ని ఆ పత్రిక చెప్పుకొన్నప్పటికీ, అసలు కారణం టిఆర్ఎస్‌ నేతలందరికీ కూడా తెలుసు.

తెలంగాణలో చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాలలో పాల్గొనే అవకాశం కల్పించింది తమ అధినేత కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో ఏపీలో ప్రవేశించాలనుకోవడమే కారణమని అని వారూ గ్రహించారు. కనుక తెలంగాణలో టిడిపిని చంపేసిన కేసీఆరే మళ్ళీ దానికి ప్రాణం పోసి బ్రతికించారని టిఆర్ఎస్‌ నేతలు సైతం భావిస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో టిడిపిని దాని అధినేత చంద్రబాబు నాయుడుని టిఆర్ఎస్‌ అడ్డుకొనే ప్రయత్నాలు చేసినట్లయితే, ఏపీలో కూడా బిఆర్ఎస్‌ను టిడిపి తప్పకుండా అదేవిదంగా అడ్డుకోగలదని టిఆర్ఎస్‌ నేతలు ఈపాటికే గ్రహించి ఉంటారు.

కేసీఆర్‌ తన బిఆర్ఎస్‌ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించి అక్కడ పోటీ చేయాలనుకొంటే తప్పు కానప్పుడు, మొదటి నుంచి ఉన్న టిడిపి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రాజకీయాలు చేయకూడదు?అనే టిడిపి ప్రశ్నకు టిఆర్ఎస్‌ ఏవిదంగా సమాధానం చెప్పాలా అని ఇంకా ఆలోచించుకొంటోంది. ఏది ఏమైనప్పటికీ దేశ రాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ తెస్తానని బయలుదేరుతున్న కేసీఆర్‌, టిడిపిని తెలంగాణలో రాజకీయాలు చేయొద్దని చెప్పగలరా?చెపితే ఆ గుణనాత్మకమైన మార్పు కేసీఆర్‌ నుంచే మొదలవ్వాలని టిడిపి గుర్తు చేయకుండా ఉంటుందా?