KCR_Narendra_Modiనువ్వో కేసుతో కొడితే… మేము రెండు కేసులతో కొడతామన్నట్లు సాగుతున్నాయి ఈడీ, ఐ‌టి దాడులు, సిట్ కేసులు. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌లని అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత సిట్ బృందం గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా మందికి నోటీసులు పంపించి విచారణకు పిలుస్తోంది. రానివారి కోసం హైకోర్టులో పిటిషన్లు వేసి కోర్టు సాయం కూడా తీసుకొంటోంది. అయినప్పటికీ ఈ కేసు దర్యాప్తు రోజుల తరబడి సాగుతున్నకొద్దీ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయే తప్ప ఇప్పట్లో కేసు కొలిక్కివచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

బహుశః అదే కేసీఆర్‌ వ్యూహం అయినా ఆశ్చర్యం లేదు. కేంద్ర ప్రభుత్వం టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపైకి ఈడీ, ఐ‌టి, సీబీఐలను పంపిస్తుంటే, అందుకు ధీటుగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పేరుతో బిజెపి పెద్దలని కూడా దోషులుగా నిలబెట్టగలిగితే కేంద్రం దూకుడిని నిలువరించవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారేమో తెలీదు.

కనుక సిట్ దర్యాప్తు బెల్లంపాకంలా సాగుతూనే ఉంది. రోజుకో కొత్తపేరు వినిపిస్తూనే ఉంది. రోజూ ఎవరో ఒకరికి కొత్తగా నోటీసులు పోస్ట్ డబ్బాలో వేస్తూనే ఉంది. టిఆర్ఎస్‌, కేంద్ర ప్రభుత్వం మద్య రాజకీయ కక్షలతో సాగుతున్న ఈ ‘చట్టబద్దమైన యుద్ధం’ ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో? తెలీదు కానీ చివరికి ఏవిదంగా ముగుస్తుందో మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇరుపక్షాల మద్య ‘ఖైదీల అప్పగింత’ లేదా కేసులను ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో అటకెక్కించేయడంతో ఈ హడావుడి, విమర్శలు, ప్రతివిమర్శలు, డ్రామాలు అన్ని ముగిసిపోతాయి. ఓటుకి నోటు కేసే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాగే జరుగుతుందని ప్రజలకి కూడా బాగా తెలుసు కనుకనే ఇప్పుడు వారు కూడా ఈ కేసులు, నోటీసులు, సోదాలపై ఆసక్తి చూపడంలేదనుకోవచ్చు.

కానీ పిల్లికి చలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు, ఐ‌టి, ఈడీ దాడులను ఎదుర్కొన్న మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి వంటివారు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటే, వారిని కేసీఆర్‌ కూడా కాపాడలేకపోతున్నారు. అలాగే సిట్ బృందం బిజెపి పెద్దలకే నోటీసులు పంపిస్తుంటే సర్వశక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం వాటిని అడ్డుకోలేకపోతోంది చివరికి చంచల్‌గూడ జైల్లో చిక్కుకుపోయిన రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌లను విడిపించుకోలేకపోతోంది. అయినపటికీ ‘గేమ్ కంటిన్యూస్…’ అన్నట్లు సాగిపోతోంది.

అయితే ఈ కేసులు, విచారణలు, సోదాలు, దాడులు, అరెస్టులు అన్నీ కూడా ఇటు సిఎం కేసీఆర్‌కి, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తమ పరిధులు, పరిమితులను అర్దమయ్యేలా చేశాయని చెప్పవచ్చు. కనుక ‘కేసులను ఇచ్చిపుచ్చుకొనే టైమ్’ దగ్గర పడినట్లే లెక్క. అది ఎప్పుడు ఏవిదంగా మొదలవుతుందో చూడాలి అంతే!

కానీ కొండని తవ్వి ఎలుకని పట్టుకొన్నట్లుగా ఈవిదంగా ముగిసే కేసుల కోసం ఈడీ, ఐ‌టి, సీబీఐ, పోలీస్, కోర్టులు అందరినీ పరుగులు పెట్టించి, దర్యాప్తు కోసం, కోర్టులో వాదోపవాదాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వృదా చేయడాన్ని ప్రశ్నించే వారెవరూ లేరు. అదే ప్రజల దౌర్భాగ్యం!