Physics-in-B.Com-Moment-for-KCRతెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. పోలింగుకు కేవలం ఒక నెల మాత్రమే ఉండటంతో పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అయితే ఇప్పుడు అందరిలోనూ కేసీఆర్ ఏమైపోయారు అనే చర్చ నడుస్తుంది. దూకుడుగా శాసనసభను రద్దు చేసిన వెంటనే 105 అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ 50 రోజులలో 100 నియోజకవర్గాలలో సభలు పెడతా అని ప్రకటించారు.

అయితే రెండు మూడు సభలు పెట్టి మాయమైపోయారు. ఈ మధ్య కాలంలో ఫార్మ్ హౌస్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ప్రచారంలో అంతా తామే అన్నట్టు దూసుకుపోతున్నారు. అయితే ఉన్నఫళంగా కేసీఆర్ కాసేపటి క్రితం నగరంలో ప్రత్యక్షమయ్యి రాజ్ భవన్ కు వెళ్లారు. రెండు గంటల పాటు ఏకాంతంగా గవర్నర్ తో చర్చలు జరిపారు.

వారు ఏం మాట్లాడుకున్నది ఇటు ప్రభుత్వ వర్గాలు గానీ రాజ్ భవన్ వర్గాలు గానీ బయటకు పొక్కనీయలేదు. మొదటి నుండి గవర్నర్ తెరాసకు అనుకూలంగా ఉంటున్నారని అభిప్రాయం ప్రతిపక్షాలలో ఉంది. పైగా ఇటీవలే కాలంలో కేంద్రంలోని బీజేపీకు కేసీఆర్ కు మధ్య ఆయన వారధిగా వుంటున్నారనే అభియోగము కూడా ఉంది. మరోవైపు నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెరాసకు ఒంటరిగా ఆధిక్యత వచ్చే అవకాశం లేదని బీజేపీ, ఎంఐఎం సాయంతో గట్టు ఎక్కడానికి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. దీనితో ఇంత కీలకమైన సమయంలో కేసీఆర్ గవర్నర్ భేటీ సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది.