KCR Telangana CMతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఏరికోరి కట్టించుకున్న ప్రగతి భవన్ ఇప్పుడు కరోనా దాటికి వణుకుతుందని సమాచారం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం ప్రకారం.. వారం రోజుల్లో దాదాపుగా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతిభవన్‌ను శానిటైజేషన్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉండడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. రాజధాని ప్రాంతంలో కరోనా విజృంభించడంతో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అక్కడ నుండే కీలక సమీక్షలు చేస్తున్నారనే వార్త ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.

అయితే ముఖ్యమంత్రి వైఖరిపై తెలంగాణ జేఏసి ఛైర్మన్ కోదండరాం పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. “ప్రగతి భవన్ వెలుపలకు వచ్చిన కరోనా లోపలకు వస్తదేమో అని భయపడి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారట. ప్రగతి భవన్‌ దాకా వచ్చిన వైరస్‌, ఫార్మ్ హౌస్ కు రాదా? ఏ ఫైల్‌ నో పట్టుకొని వస్తుంది. ఇసుకలో తలపెట్టిన ఉష్ణ పక్షి వ్యవహారంలా ఉంది,” అని ఆయన ఎద్దేవా చేశారు.

“ఇది మహమ్మారి అని గుర్తించండి. కోర్టులు పదే పదే చెబుతున్న మాటలు వినండి. ఉపద్రవం ముంచుకొస్తున్న సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిపాలనా దక్షతతో వ్యవహరించండి అని చెప్పాల్సి రావడమే దౌర్భాగ్యం. అయినా మనకు చెప్పక తప్పదు,” అంటూ కోదండరాం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.