KCR trs party is like akshaya patraమన హిందూ పురాణాల ప్రకారం “అక్షయ పాత్ర”కు చాలా ప్రాధాన్యత ఉంది. ‘అక్షయ పాత్ర’ అనేది పార్వతి దేవి సృష్టించిన ఒక ఆహార పాత్ర. ఆ పాత్రలో ఆహారం ఎంత మంది తిన్న ఇంకా కొంతమందికి మిగిలే ఉంటుంది. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రివర్యులు స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన అయిన “కారు”లో కూడా ఎంతమంది ఎక్కినా ఇంకా కొంతమందికి ఖాళీ ఉన్నట్లుగా కనపడుతోంది.

ఇప్పటికే కేసీఆర్ తన కారులో చాలా మంది ప్రతిపక్ష నేతలను ఎక్కించారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాక కాంగ్రెస్ ముఖ్య నేతలను చాలా మందిని ‘కారు’ ఎక్కించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. వారిలో కేకే, డిఎస్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అలాగే టిడిపిలో అయితే గెలిచిన మొత్తం 15 మంది నేతలలో 9 మందిని ఇప్పటికే ‘కారు’ ఎక్కించారు కేసీఆర్. ఒకప్పుడు టిడిపిలో చక్రం తిప్పిన కడియం, తలసాని, తుమ్మల, ఎర్రబెల్లి మొదలైన ప్రముఖులున్నారు.

ఇక, ఇటీవల జరిగిన హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలలో ఎవ్వరూ ఉహించని విధంగా టిఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలలో విజయం సాధించడంతో ‘కారు’ జోరు మరీ పెరిగింది. ఇక తెలంగాణాలో ‘ప్రతిపక్షం’ అన్న పేరు వినపడని విధంగా కేసీఆర్ తన దూకుడైన రీతిలో వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే కారు మళ్ళీ ‘సైకిల్’ను గుద్దింది. దీంతో ఈ సారి వివేక్, ఎర్రబెల్లి, ముకేష్ యాదవ్ లు కారెక్కేసారు.

అయినా తెలుగు తమ్ముళ్ళ కోసం “కారు” ఇంకా ఖాళీగా ఉందంటూ హైదరాబాద్ లో చక్కర్లు కొడుతోంది. ఇలా కేసీఆర్ “కారు” ప్రతిపక్ష నేతల పాలిట ‘అక్షయ పాత్ర’లా మారిందనేది పరిశీలకుల మాట. తెలంగాణ ప్రాంతం నేతలతో అయినా ‘కారు’ నిండుతుందో లేక సరిహద్దులు దాటుతుందో చూడాలి!