Nizam Heirs Object KCR's New Assembly Plan?కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ (ఇరుం మంజిల్‌)ను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని.. ఆ భవనాన్ని నిర్మించిన నవాబ్‌ సఫ్దర్‌ జంగ్‌ ముషీరుద్దౌలా ఫక్రుల్‌ ముల్క్‌ వారసులు తీవ్రంగా తప్పుబట్టారు. అయినా సరే ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం అక్కడ రాబోయే శాసనసభా బిల్డింగులకు శంకుస్థాపన చేశారు. నిజాం వారసులతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న వారు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు.

“ఎర్రమంజిల్‌ ప్రాంతంలో ఇప్పటికే ఇరుకు రోడ్డులు వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలతో తరచూ ట్రాఫిక్ ఆంక్షలు పెడతారు. దానికి తోడు వీఐపీ మూవ్మెంట్ వల్ల కూడా ట్రాఫిక్ బాధలు ఎక్కువ అవుతాయి,” దీనితో ఈ ప్రతిపాదన మాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు అని స్థానికులు అంటున్నారు. రాష్ట్రం విడిపోయి.. ఎమ్మెల్యేల సంఖ్య 294 నుంచి 119కి తగ్గిందని, వీరికోసం ప్రస్తుత అసెంబ్లీ భవనంలో విశాలమైన స్థలం ఉండగా.. దానిని వదిలేసి చారిత్రక కట్టడాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

“150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మరో 200 ఏళ్లపాటు ఇలాగే ఉంటుంది. ఈ వారసత్వ కట్టడాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాల్సిందిపోయి.. కూల్చివేయాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం మమ్మల్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది’’ అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారని సమాచారం. వాస్తుప్రకారం ఎర్రమంజిల్‌ లో అసెంబ్లీ ఉంటే తెరాసకు ఎదురు ఉండదని కొందరు చెప్పిన విషయాన్నీ కేసీఆర్ బలంగా నమ్ముతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.