KCR-TRSదుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తుంది. గెలిచిన బీజేపీ జీహెచ్ఎంసి ఎన్నికలలో కూడా ఇదే తరహా ఫలితం రాబట్టడానికి తహతహలాడుతుంటే… అధికార తెరాస మాత్రం అయోమయంలో ఉంది. అసలు ఇప్పుడు జీహెచ్ఎంసి ఎన్నికలు జరపడం ఎంతవరకూ కరెక్ట్ అని ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది.

కార్ పార్టీలోని ఒక వర్గం ఇప్పుడే ఎన్నికలు జరగాలి అంటుంది. “ఇటీవలే వరదల సమయంలో ఇబ్బంది పడిన కుటుంబాలకు 10,000 రూపాయిల చప్పున ఇచ్చాం. వారు దానిని మర్చిపోక ముందే ఎన్నికలు జరగాలి,” అని వారు వాదిస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం దుబ్బాక ఎఫెక్ట్ తగ్గాకా ఎన్నికలు జరపడమే మేలు అని అంటుంది.

“దుబ్బాక ఫలితం ప్రజలు మర్చిపోయాకా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపితే మేలు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తుంది,” అని వారి వాదన. దానిపై నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటారు. ఇంతవరకు వచ్చాకా వెనక్కు తగ్గితే పార్టీ భయపడిన ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్తుందని మరో వర్గం వాదన.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయిస్తే.. డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీపావళి మరుసటిరోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు రేపట్లో నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రి.