KCR-TRSదుబ్బాక ఉపఎన్నికలో తెరాసకు వచ్చిన ఫలితం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. అంతా బాగానే ఉందనుకున్నామే ఎక్కడ తేడా కొట్టింది అని వారు ఆలోచనలో పడ్డారు. నిన్న సాయంత్రం గెలిస్తే గంట పాటు మీడియా ముందు ఊదరగొట్టే ముఖ్యమంత్రి మొత్తానికి మొహం చాటేశారు. మంత్రి కేటీఆర్ ఏక వాక్యంలో ప్రెస్ మీట్ ముగించేశారు.

మరోవైపు బీహార్ రాష్ట్ర ఎన్నికలు కూడా హోరాహోరిగా జరిగాయి. ఎన్డీయే కూటమికి అదృష్టం కలిసొచ్చి అధికారం చేజిక్కించుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కాంగ్రెస్ కు 70 సీట్లు ఇస్తే ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలిచింది. అదే గనుక జరగకపోయి ఉంటే బీహార్ ఎన్డీయే చెయ్యి దాటిపోయేది. ఒక రకంగా మోడీ-అమిత్ షాలకు ఇది కూడా ఒక వార్నింగ్ లాంటిదే.

కేసీఆర్ అంటే తెలంగాణ… తెలంగాణ అంటే కేసీఆర్, మోడీ అంటే ఇండియా, ఇండియా అంటే మోడీ అన్న ఆలోచనతోనే ఆ రెండు పార్టీల వ్యవహారశైలి ఉంది. అయితే చరిత్రలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయి… ప్రజాస్వామ్యంలో అది మరింత తేలిక. గతంలో ఎంతో బలమైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎలా ఓడిపోయాయో మనం చూశాం.

మనం ఏం చేసినా చెల్లుతుంది అనే విధంగా కాకుండా ప్రజలు ఏం అనుకుంటున్నారో నిత్యం వింటూ ఉంటేనే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి. ఒక్కో సారి అంతా చేసినా ప్రజలు మార్పు కోరుకోవచ్చు. కావునా రాజకీయ నాయకులు తాము కలకలం అధికారంలోనే ఉంటాం అనుకుంటే దెబ్బతినడం ఖాయం. అది గ్రహిస్తే అటు మోడీకి ఇటు కేసీఆర్ కు మంచిది.