KCR TRS confident on winning elections 2024తెలంగాణ రాష్ట్రంలో చాలా బలమైన, సుస్థిరమైన టిఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు కూడా బలంగానే ఉన్నాయి. అయినా రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని పార్టీలు, కొందరు వ్యక్తులు ఎందుకు భావిస్తున్నారో తెలీదు కానీ తెలంగాణలో హడావుడి చేస్తూనే ఉన్నారు.

వారిలో మన సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల, తెలంగాణ ఉద్యమాలలో చాలా కీలకపాత్ర పోషించి తరువాత ప్రాధాన్యం కోల్పోయిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కొన్నినెలల క్రితమే తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ఆర్‌.ప్రవీణ్ కుమార్, ‘టీం మల్లన్న-7,200’ పేరుతో ప్రజల వద్దకు బయలుదేరుతున్న తీన్మార్ మల్లన్న…ఇంకా చాలా మందే ఉన్నారు.

టిఆర్ఎస్‌ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుండటం ప్రజలు స్వయంగా కళ్ళారా చూస్తున్నారు. పైగా వివిద వర్గాల ప్రజల అవసరాలను, ప్రభుత్వ ఆర్ధిక శక్తి, పరిమితులను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా నడిపిస్తోంది కూడా. కనుక ప్రజలు టిఆర్ఎస్‌ వైపే మొగ్గు చూపవచ్చు.

ఈవిషయం రాష్ట్రంలో హడావుడి చేస్తున్న ప్రతిపక్షాలకు, తాజకీయ శక్తులకు తెలియదనుకోలేము. కానీ వారి హడావుడి చూస్తుంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో ఏదో జరిగిపోబోతోందన్నట్లు అనిపించడం సహజం.

కనుకనే తెలంగాణ ప్రజలు తమవైపే ఉన్నారని సిఎం కేసీఆర్‌ గట్టి నమ్మకంతో ఉన్నా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఈ హడావుడితో పార్టీకి కించిత్ కూడా నష్టం కలగకూడనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ కిషోర్‌ సాయం తీసుకోవడానికి సిగ్గు పడలేదు. అలాగే తలకు మించిన భారమే అయినా దళిత బంధు వంటి భారీ పధకాన్ని తలకెత్తుకొన్నారు. కానీ దానినీ చాలా ఆచితూచి అమలుచేస్తున్నారు.

అలాగే ఉద్యోగాల భర్తీపై ఇంతకాలం ప్రతిపక్షాలు ఎంత యాగీ చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు మొదలుపెట్టడం కూడా సిఎం కేసీఆర్‌ ముందు చూపుకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

కనుక తెలంగాణ ప్రతిపక్షాలు, రాజకీయ శక్తులు చేస్తున్న హడావుడితో వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌కు కొన్ని సీట్లు నష్టపోవచ్చునేమో కానీ మళ్ళీ అధికారం మాత్రం దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది