KCR TRS Advertisement in all leading daily news papersఅవసరానికి మించి డబ్బు ఉంటే… అది ఏ రూపం దాలుస్తుందో వ్యక్తిగతంగా అనేక మంది జీవితాలు ప్రజలకు ‘ఆదర్శం’గా నిలిచాయి. అయితే ఇదే డబ్బు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఉంటే… ప్రజలకు ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు. మరి మనదేశంలో ఎన్ని రాష్ట్రాలకు బడ్జెట్ ను మించిన ఆదాయం ఉందో విజ్ఞులకు విదితమే.

ఉత్తరాదిన ఉన్న గుజరాత్ ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోవడంతో, ఆ రాష్ట్రం గురించి పెద్దగా చర్చలు అవసరం లేదు. ఇక, కొత్తగా ఏర్పడినా, హైదరాబాద్ రెవిన్యూ పుణ్యమా అంటూ మిగులు రాష్ట్రంగా మారిన తెలంగాణా గడ్డ మీద ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి? అంటే ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా మారిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

కావల్సినంత రెవిన్యూ ఉండడంతో హైదరాబాద్ మేయర్ పీఠంపై జెండా పాతాలని చాలా “ఆఫర్లు” ప్రకటించిన కేసీఆర్, ఇంకా వెనక్కి తగ్గకుండా ప్రచారానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పోలింగ్ తేదీ నాడు రాష్ట్ర పత్రికల నుండి, జాతీయ పత్రికల వరకు అన్ని పేపర్లలో తొలి పేపర్ మొత్తం కేసీఆర్ ప్రచారాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

రాజకీయ పార్టీలకు, నాయకులకు ప్రచారం సర్వసాధారణమే. ఇందులో విమర్శించడానికి అవకాశమే లేదు. అయితే కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు మాత్రం విమర్శలకు తావిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొదటి పేజ్ మొత్తం ప్రచారానికి కేటాయించాలంటే… దానికి చాలా “పెద్ద” మొత్తంలో ఖర్చు చేయాలి. మరి అంత ఖర్చును పార్టీ పరంగా ఇచ్చుకుంటే పర్వాలేదు, కానీ కేసీఆర్ అది ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారంగా ముద్రించడంతో ఈ ఖర్చంతా ప్రజాధనం ఖాతాలో నుండి జమ చేయాల్సిందే. దీంతో ఒక్క రోజు ప్రచారం కోసం తెలంగాణా ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిందో అంటూ తెలంగాణా గట్టు మీద చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపుగా ఎంతవుతుందంటారు..?!