KCR-YS -Jagan21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలను ఆహ్వానించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ను కలిసి ఆయనకు వ్యక్తిగతంగా ఆహ్వానం పలుకుతారు. మరోవైపు సోమవారం ఆయన అమరావతి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యలపై కూడా వారు చర్చిస్తారని సమాచారం.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాద్ లో కేటాయించిన ప్రభుత్వం భవనాలను జగన్ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఎటువంటి షరతులు లేకుండా భవనాలు అప్పగించేశారని విమర్శలు వస్తుండడంతో ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ కు అనుకూలమైన నిర్ణయం ఒకటి చిన్నదో పెద్దదో తీసుకుందాం అని కేసీఆర్, జగన్ అనుకున్నారని సమాచారం. విభజన సమస్యలపైన ఇద్దరు సీఎంలు చర్చిస్తారని, అందుకోసం వివరాలు సిద్ధంగా ఉంచాలని తెలంగాణ సీఎం కార్యాలయం గురువారం ఆదేశాలు జారీ చేసిందట.

ఈ వార్తలతో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాల సహకారంతో ముందుకెళ్తాం అని చెప్పించడం గమనార్హం. మరోవైయో జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తారని వార్తల మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం లేదని చంద్రబాబు మీద విమర్శలు చేశారు జగన్. ఓటుకు నోటు కేసు వల్ల లొంగిపోయారు అని ఆక్షేపించారు.