KCR to launch Free Urea scheme for farmersరైతులే టార్గెట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే రైతు బంధు, రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ వంటి పధకాలు ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇంకో పధకానికి నాంది పలకనుంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే రైతులకు ఉచితంగా యూరియా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం.

వానాకాలం, యాసంగిలో ఏ పంట సాగు చేసినా యూరియా వినియోగం తప్పనిసరి. ఇటీవలే కేంద్రం యూరియా రేటు పెంచింది కూడా. దీనితో రైతులకు ఉచితంగా యూరియా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ పధకానికి 500 కోట్లు ఖర్చు అవ్వనుందని అంచనా. ప్రభుత్వం నేరుగా కర్మాగారాల నుంచి కొనుగోలు చేస్తే, ధర కొంత తగ్గే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఖరీఫ్‌ సీజన్‌కు ప్రభుత్వం 500 కోట్లు భరించడానికి సిద్ధపడితే, రైతులకు ఉచితంగా యూరియా అందించవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. యూరియా ఉచిత పంపిణీ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల వేళ రైతు కుటుంబాల ఓట్లు గంపగుత్తుగా ఈ పధకాలు తెచ్చి పెడతాయని కేసీఆర్ అంచనా.