KCR to conclude on TSRTC on 2nd November 2019తెలంగాణ ఆర్టీసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా పట్టువిడవనట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినట్టు కార్మికుల డిమాండ్లను ఏ మాత్రం ఖాతరు చెయ్యకుండా ప్రైవేటుకు రూట్ క్లియర్ చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఆర్టీసీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గం శనివారం సమావేశం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గం సమావేశం కానుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో ఇక ఈ విషయానికి ముగింపు పలకాలని కేసీఆర్ నిర్ణయించున్నారట.

ఆర్టీసీలో సగం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, మిగతా 20 శాతం ప్రైవేట్ స్టేజ్ కేరియర్లు ఉండాలన్నది కేసీఆర్ ప్రభుత్వం ఆలోచన. అందుకు అనుగుణంగా ఇప్పటికే 26 శాతం ఉన్న అద్దె బస్సులకు అదనంగా మిగతా 4శాతం అద్దెబస్సులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇక మిగిలేది.. ప్రైవేట్ కేరియర్లకు అనుమతులు ఇవ్వడమే.

ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ నిర్వీర్యం అవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఆ మధ్య ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగానే ఆర్టీసీ సమ్మెను కాదు, ఆర్టీసీనే ముగించేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా పావులు కదపడంతో సమ్మె చేస్తున్న కార్మికులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.