KCR - Chandrababu - Naidu-2014 ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ఒక తప్పు చేశారు. 2015 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి వల్ల అప్పట్లో అంత ఫిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఉద్యోగులు తెలంగాణతో పోల్చుకుని నిరాశపడతారని, అది రాజకీయంగా ఇబ్బందని చంద్రబాబు భావించి అదే స్థాయిలో ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇచ్చారు కూడా. అది రాజకీయంగా కలిసి వస్తుందని చంద్రబాబు భావించారు.

అయితే ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఉద్యోగులు గంపగుత్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ కు వేశారు అని పోస్టల్ బాలట్ ఓట్ల లెక్కింపు సందర్భంగా తెలిసింది. అంటే ఆ సాహసం చంద్రబాబుకు ఉపయోగపడలేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడే గద్దెనెక్కిన జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ఇప్పుడు అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తలపోటుగా మారింది. తెలంగాణ ఆర్ధిక శాఖ గట్టిగా 20% ఐఆర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదించింది.

వివిధ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల కారణంగా తెలంగాణ ఆర్ధిక పరిస్థితి కూడా బాలేదు. అక్కడ కూడా అప్పులతోనే బండి నడిపిస్తుంది ప్రభుత్వం. కాకపోతే ధనిక రాష్ట్రమనే పేరుతో అప్పులు బాగా పుడుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు లాగా గొప్పలకు పోయి 27 శాతం ఐఆర్ ఇస్తారేమో చూడాలి. అలాగే సీపీఎస్, ఆర్టీసీ విలీనం వీటన్నింటిపై జగన్ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెస్తాయి. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది.