KCR_BRS_Andhra_Pradeshఇల్లలకాగానే పండగ కాదన్నట్లుంది తోట చంద్రశేఖర్‌, పార్ధసారధి, రావెల కిషోర్ బాబుల పరిస్థితి. ముగ్గురూ హైదరాబాద్‌ వెళ్ళి కేసీఆర్‌ని కలిసి బిఆర్ఎస్‌ పార్టీలో చేరిపోగా వారిలో తోట చంద్రశేఖర్‌కి ఏపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఏపీలో ఇంకా పార్టీ ఏర్పాటు కాకమునుపే రేపు ఖమ్మంలో జరుగబోయే బిఆర్ఎస్‌ ఆవిర్భావసభకి ఏపీ నుంచి కనీసం లక్షమందిని తీసుకురావాలని కేసీఆర్‌ కోరిన్నట్లు తెలుస్తోంది. అందుకోసం కేసీఆర్‌ వారికి అవసరమైన ‘సహాయ సహకారాలు’ అందించేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. కానీ వారు ముగ్గురూ చాలా కాలంగా రాజకీయాలలో యాక్టివ్‌గా లేకపోవడంతో ఎవరూ కూడా పట్టుమని పదివేలమందిని ఖమ్మం సభకి తరలించలేని పరిస్థితి నెలకొంది.

రేపటి సభకి ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, పినరయి విజయన్, యూపీ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్‌తో సహా పలు రాష్ట్రాలకి చెందిన పలువురు రాజకీయ నాయకులు రాబోతున్నారు. కనుక 5 లక్షల మందితో భారీ బహిరంగసభ నిర్వహించి తన సత్తా చాటుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ జిల్లాలు, నియోజకవర్గాల నుంచి నాలుగు లక్షల మందిని ఖమ్మం సభకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొన్నారు. కానీ ఏపీ నుంచి పదివేల మందిని కూడా తరలించలేకపోతే ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఏపీలో బిఆర్ఎస్‌కి చాలా ఆదరణ ఉందని గొప్పలు చెప్పుకొంటున్న కేసీఆర్‌తో సహా ఆ పార్టీ నేతలకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక సరిహద్దు జిల్లాలుగా ఉన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే వీలైనంత ఎక్కువ మందిని సమీకరించి బహిరంగసభకి తీసుకువచ్చేందుకు బిఆర్ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

ఏపీ నుంచి ఖమ్మంకి లక్ష మందిని తరలించాలంటే చాలా కష్టం కానీ ఈ సందర్భంగా కేసీఆర్‌కి అభినందనలు తెలియజేస్తూ ఏపీలో ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు కనుక ఏపీ బిఆర్ఎస్‌ నేతలు అందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.