Telangana-YS-Jaganతెలంగాణ ఏపీ రాష్ట్రాల పరిస్థితిని భారత్‌ పాక్‌ దేశాలతో పోల్చుకోవచ్చునంటే రాష్ట్ర భక్తులకు ఆగ్రహం కలగవచ్చు కానీ ఇది చేదు వాస్తవం. ఆనాడు భారత్‌ కంటే కొన్ని గంటల ముందు పాకిస్థాన్‌ స్వాతంత్ర్యం పొందింది. కానీ ఈ ఏడున్నర దశాబ్ధాలలో పాక్‌ దయనీయ స్థితికి చేరుకోగా భారత్‌ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది.

అదేవిదంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సరిగ్గా 8 ఏళ్ళ క్రితం ఇదే జూన్‌ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. తెలంగాణకు అప్పటికే చాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ రాజధాని దక్కింది. దానితోపాటు హైదరాబాద్‌లోని అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీల ద్వారా వచ్చే ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి అక్షయపాత్రలా ఆదుకొంది. అప్పటి నుంచి సిఎం కేసీఆర్‌ తన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టుకొనేందుకు గట్టిగా కృషి చేస్తూ నేటికీ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ రాష్ట్రంగా నిలిపారు.

రాష్ట్ర విభజనతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. హైదరాబాద్‌ ద్వారా వచ్చే భారీ ఆదాయం కోల్పోయింది. అప్పటికి రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఈ సమస్యలను సవాలుగా తీసుకొని ముందుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విద్యుత్‌ సంక్షోభం నుంచి విముక్తి కల్పించారు. ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణతో పోటీపడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు శాయశక్తుల కృషి చేశారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. అమరావతి కేంద్రంగా పెట్టుబడులు, ఉన్నత విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలను ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ తరువాత జరిగిన కధ అందరికీ తెలిసిందే.

తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌కు మళ్ళీ రాష్ట్ర పగ్గాలు అప్పగించగా, ఏపీ ప్రజలు రాజకీయ మాయలో పడి చంద్రబాబు నాయుడుని కాదని జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. తత్ఫలితంగా నేడు ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసింది.

ఏపీ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళయినా ఇంతవరకు రాజధాని లేదు. మరో ఆరేళ్ళ వరకు రాజధాని నిర్మించలేమని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పేసింది. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిన్ననే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. విద్యుత్‌ కోతలతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. కొత్తవి రావడం లేదు. మరోపక్క సంక్షేమ పధకాల కోసం చేస్తున్న అప్పుల ఊబిలో రాష్ట్రంలో కూరుకుపోతోంది. వాటి కోసం లబ్దిదారులతో పాటు మిగిలిన ప్రజలు కూడా మూల్యం చెల్లించక తప్పడం లేదు.

ఎనిమిదేళ్ళ తరువాత ఏపీలో ఇప్పుడు ఏమి కనిపిస్తున్నాయంటే అప్పులు, విద్యుత్‌ కోతలు, సమస్యలు, రాజకీయాలు మాత్రమే. కానీ అదే… తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా వైద్య విద్యుత్‌ రంగాలలో అభివృద్ధి, సాగునీరు, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి.

దేశవిదేశాలకు చెందిన పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్యసంస్థలు, పెట్టుబడిదారులు లక్షల కోట్లతో తెలంగాణకు క్యూ కడుతుంటే, ఏపీ వైపు చూసేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. కనీసం అధికార వైసీపీలో నేతలు సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పేందుకు సాహసించడంలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

తెలంగాణ అభివృద్ధి గురించి వ్రాయాలంటే ఓ పెద్ద పుస్తకం కూడా సరిపోదు. అదేవిదంగా ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోతున్న ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ రాజకీయాల గురించి ఓ పెద్ద పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ళ తరువాత మన రాష్ట్రం ఈవిదంగా ఉన్నందుకు మన పాలకులు ఏమాత్రం బాధపడకపోగా ప్రజలు ఇటువంటి పాలననే కోరుకొంటున్నారని చెప్పుకోవడం ఇంకా బాధాకరం.