Huzoornagar-Election-Turned-Crucial-For-KCR-in-the-Last-Minuteతెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు అక్షింతలు పడ్డాయి. ఒక వైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీకి 49 కోట్ల రూపాయలు ఇవ్వలేదా అని మరోసారి హైకోర్టు ప్రశ్నించింది. అసలు ప్రభుత్వానికి ఆర్టీసీ సమస్యను పరిష్కరించే ఆలోచన ఉందా?లేదా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ అంశాన్ని మానవత్వ కోణంలో కూడా చూడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టుకు ఆర్టీసీ నివేదిక సమర్పించిన తీరును కూడా తీవ్రంగా తప్పుపట్టారు. నివేదిక పేరుతో అబద్దాలు రాస్తారా? తన అనుభవంలో ఇంత అబద్దాల నివేదికను చూడలేదని న్యాయమూర్తి పేర్కొనడం విశేషం. ఆర్టీసీకి ప్రభుత్వం ఏమీ భాకీ లేదని చెప్పి సంస్థ వైఫల్యంలో తమ పాత్ర ఏమీ లేదని చెప్పే క్రమంలో లెక్కలు తారుమారు చేసినట్టుగా కనిపిస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం తాము ప్రభుత్వ ఆదేశానుసారమే లెక్కలు తయారు చేసినట్టు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.

ప్రభుత్వం కార్మికుల ఇగో మధ్యలో తాము కూడా నలిగిపోతున్నట్టు చెబుతున్నారు. హైకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 34వ రోజుకు చేరింది. ఇరుపక్షాల ఇగోలు ఎలా ఉన్నా మధ్యలో సామాన్య ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.