Telangana-Corona-Crisis-KCRతెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టు సాకారమయ్యే సమయం ఆసన్నమయింది. హై కోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో హైదరాబాద్ లోని పాత సచివాలయం కూల్చివేత అర్ధరాత్రి నుండి మొదలుపెట్టారు. 132 ఏళ్ల చరిత్ర కలిగిన సచివాలయం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతుంది.

ఉమ్మడి ఏపీలో ఇక్కడి నుంచే సీఎంల పరిపాలన చేసారు… 16 మంది ముఖ్యమంత్రుల పాలనాకేంద్రంగా ఈ సచివాలయం 25 ఎకరాల్లో 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమయ్యింది. ఇప్పుడు దానిని పూర్తిగా కూల్చి వేసి అదే స్థానంలో 500 కోట్లతో కొత్త సచివాలయం అక్కడే నిర్మించనున్నారు.

ఏడాది క్రితమే కొత్త సచివాలయానికి కేసీఆర్ భూమిపూజ చేశారు. అప్పటి నుండే సచివాలయాన్ని ఖాళీ చేసి తాత్కాలిక బిల్డింగులు నుండి పరిపాలన సాగిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వాస్తు సరిగ్గా లేదనే కారణంగా కేసీఆర్ సచివాలయానికి రావడం మానేశారు. ఆ తరువాత ప్రగతి భవన్ ని నిర్మించి ఈరోజు వరకూ అక్కడి నుండే పరిపాలన సాగించే వారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ తో జనం అల్లాడుతుంటే ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రోనా సంక్షోభంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదని, రైతులకు రుణమాఫీ డబ్బులు లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సచివాలయం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.