KCR-Telangana-TRS---Revanth-Reddyకాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో ఎంతో వివాదాస్పదమైన తెరాస ప్రజాఆశీర్వాద సభ ప్రశాంతంగా ముగిసింది. ఈ సభ కోసం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి వివాదం సృష్టించిన పోలీసులు ఆయన విడుదలకు ఉత్తరువులు వచ్చినా ఆయనను కొడంగల్ ముఖ్యమంత్రి సభ పూర్తి అయ్యే వరకు వెళ్లనియ్యకుండా తెలివిగా వ్యవహరించారు. అయితే రేవంత్‌ రెడ్డి పేరును కనీసం ప్రస్తావించకుండానే కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి గెలిచినట్టే అని తనకు అర్థమైందని కేసీఆర్‌ అన్నారు. పాలమూరుకు శ్రతువులు బయట ఎక్కడో లేరని, పాలమూరు జిల్లాలోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్‌ను అభివృద్ధి చేసే పూచీ తనదంటూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తెరాసను గెలిపిస్తే ఇక్కడకి నేనే స్వయంగా వచ్చి సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటా అని ఆయన చెప్పుకొచ్చారు.

దాదాపు 20 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో కొడంగల్ అభివృద్ధి, టీఆర్ఎస్ అభ్యర్థి గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలదు. అనంతరం తనకు వేరే సభ ఉందంటూ ప్రసంగాన్ని ముగించారు. మరోవైపు రేవంత్‌రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని అడ్వొకేట్‌ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రేవంత్ విడుదలపై ఏజీ వాంగ్మూలాన్ని హైకోర్టు నమోదు చేసింది. అరెస్టుకు ఆధారాలు రేపు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఈ విషయంలో కాంగ్రెస్ పై చెయ్యి సాధించినట్టు అయ్యింది. అదే విధంగా ప్రజల సానుభూతి కూడా వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.