KCR - KTRతెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణవాదులకు, సీమాంధ్రులకు ఒకేసారి గేలం వేస్తున్నట్టుగా ఉంది. ఒక పక్క కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అమ్మలక్కలు తిడతా ఆంధ్రోళ్ళ పాలన మళ్ళి తెస్తారా అంటూ ఉద్యమం నాటి పలుకులు పలుకుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసి హైదరాబాద్ లో ఉండే సెట్లర్లు తమ మూలలను మర్చిపోయి తమని తాము తెలంగాణవారిగా భావించాలని ఉచిత సలహా ఇచ్చారు.

మరి ఆయన కూతురు కవిత అమెరికా వెళ్ళి బతుకమ్మ ఆడటం ఎందుకో? అక్కడి వారికి తమ తెలంగాణ మూలాలు మర్చిపోయి అమెరికా వాళ్ళుగా భావించండి అని చెప్పొచ్చుగా అని కొందరు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఉన్నఫళంగా తమకు సీమాంధ్రుల ఓట్లు కూడా కావాలని గుర్తు వచ్చినట్టుంది కేటీఆర్ కు.

నిన్న ఆయన తెలంగాణ లో స్థిరపడ్డ కోస్తా, రాయలసీమ వాసులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించారు. వారందరికి తాను వ్యక్తిగతంగా భరోసా ఇస్తున్నానని ఆయన అన్నారు. అందరికి అండగా ఉంటానని ఆయన చెప్పారు. పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కకు పెట్టాలని ఆయన కోరారు.

గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించి కాదని, ఆయన విమర్శించింది చంద్రబాబునేనని తెలిపారు. చంద్రబాబుతో తెరాసకు అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని అన్నారు. దీనిబట్టి తెరాస వారు ఒకేసారి తెలంగాణవాదులకు, సీమాంధ్రులకు గేలం వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే సెట్లర్లుకు చెప్పే మాటలు తెలంగాణ వాదులకు, తెలంగాణ వాదులకు చెప్పే మాటలు సెట్లర్లుకు చేరితే మొదటికే మోసం జరగొచ్చు.