KCR Telangana Lockdownతెలంగాణ లో మే 12, బుధవారం ఉదయం 10 గంటల నుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం వుంటుందని నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత నుండి తరువాతి రోజు ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్ డౌన్ అమలు చెయ్యబోతున్నారు.

అయితే ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద జోకులు పేలుతున్నాయి. రెండు రోజుల క్రితమే కేసీఆర్ ఒక రివ్యూ మీటింగ్ లాక్ డౌన్ పెట్టే సమస్యే లేదని, లాక్ డౌన్ పెట్టిన రాష్ట్రాలలో ఎక్కడా కూడా కేసులు తగ్గినట్టు ఆధారాలు లేవని, లాక్ డౌన్ పెడితే పేదలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పుకొచ్చారు.

గత కొన్ని రోజులుగా తెలంగాణ మంత్రులు, అధికారులు కూడా ఇదే పాట పాడుతున్నారు. అయితే ఇప్పుడు మాట మార్చి లాక్ డౌన్ కే ఓటు వేశారు. కేసీఆర్ అంతే ఏదైనా చెబితే అది చెయ్యరు కాకపోతే తన వాగ్ధాటితో తాను ఎప్పటికప్పుడు ఏది చేస్తే అదే కరెక్టు అన్నట్టు ప్రజలను నమ్మిస్తారు అంటూ పలువురు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.

అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా ఈ పాక్షిక లాక్ డౌన్ కారణంగానైనా తెలంగాణలో పరిస్థితులు అదుపులోకి వస్తే అదే చాలు అనుకోవాలి. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తెలంగాణలో కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.