KCR _YS Jaganదేశవ్యాప్తంగా లాక్ డౌన్ లో ఈరోజు నుండి చాలా మినహాయింపులు ఇచ్చారు నేటి నుండి. దీనితో పలు చోట్ల ట్రాఫిక్ జాములు కూడా అవుతున్నాయి. అదే సమయంలో వైన్ షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. రానున్న రోజులలో పరిస్థితి దారుణంగా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ తరుణంలో లాక్ డౌన్ పై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

దీనితో రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశం కీలకం కాబోతుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నా 21 వరకూ లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉన్నట్టు కొన్ని వార్తా ఛానళ్ళు చెప్పుకొస్తున్నాయి. రేపు మంత్రివర్గ సమావేశం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ సడలింపు, మద్యం షాపులు ఓపెన్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ తప్పు తెలంగాణలో జరగకూడదని కేసీఆర్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని 33 జిల్లాలలో 20 జిల్లాలలో పూర్తిగా కరోనా కేసులు అనేవి రిపోర్టు కాలేదు. ఈ తరుణంలో ఆ మేరకైనా కేసీఆర్ లాక్ డౌన్ సడలిస్తారా అని మరికొందరు అంటున్నారు.

అయితే ఎక్కువగా ఆదాయం సమకూర్చే హైదరాబాద్, రంగారెడ్డి లో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉంది. నిన్న రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలంగాణలో మొత్తం కేసులు 1,082. గత కొన్ని రోజులుగా తెలంగాణలో టెస్టులు తక్కువ చేసి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కేసులను తక్కువ చేసి చూపిస్తుందనే విమర్శలు వస్తున్నాయి.