KCR-Telangana-Elections-తెలంగాణలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలకు వచ్చే ఎన్నికలు చాలా కీలకంకానున్నాయి. టిఆర్ఎస్‌ పార్టీ మళ్ళీ గెలిచితీరాలి లేకుంటే కేటీఆర్‌కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించదు.

ఈ మూడేళ్ళలో రాష్ట్రంలో బిజెపి చాలా బలపడింది. రాష్ట్రంలో బిజెపికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది కూడా. మళ్ళీ మళ్ళీ ఇటువంటి సానుకూల రాజకీయ వాతావరణం సృష్టించడం అసాధ్యం. కనుక వచ్చే ఎన్నికలలో బిజెపి కూడా గెలిచితీరాల్సిందే.

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చి రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి సంపాదించుకొన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోతే రేవంత్‌ రెడ్డి అడ్రస్ లేకుండాపోతారు. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవలసిందే.

కానీ పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌-బిజెపిల మద్యే ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని, బిజెపిని లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేస్తున్నారు. ఇటీవల ఏక్‌నాధ్ షిండే అనే కట్టప్ప సాయంతో బిజెపి మహారాష్ట్రలో శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారం చేజిక్కించుకోవడం, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూడా కట్టప్పల సాయంతో కూలద్రోస్తామని బిజెపి హెచ్చరికల నేపధ్యంలో సిఎం కేసీఆర్‌ అప్రమత్తమత్తమైనట్లున్నారు.

అందుకే ముందస్తుకి సిద్దం అంటూ ఎన్నికల గంట కొట్టేశారు. అయితే ఇక్కడే చిన్న మెలిక పెట్టారు. మోడీ కూడా తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల తేదీ ప్రకటించాలని షరతు విధించారు. మరోపక్క జాతీయపార్టీతో ఢిల్లీకి వెళ్ళి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని చెపుతున్నారు. కనుక కేసీఆర్‌ ఏదో ఎత్తుగడతోనే ఈవిదంగా మాట్లాడుతున్నారని భావించవచ్చు.

అయితే దేశముదురు కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఆయన వ్యూహాన్ని అర్ధం చేసుకోలేరని అనుకోలేము. కానీ కేసీఆర్‌ను ఢీకొనగలమని చెప్పుకోవడానికి అవి కూడా ముందస్తు ఎన్నికలకి సిద్దం అన్నట్లు మాట్లాడటం మొదలుపెట్టాయి. నిజానికి వాటిని ఈ ముగ్గులోకి దించాలనే సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేసి ఉండవచ్చు. కనుక ఆయన వ్యూహం ఫలించిందని అర్దమవుతోంది.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళతారా లేక ముందస్తుకి వెళతారా అనే గందరగోళంలో ప్రతిపక్షాలను ఉంచుతూ గత ఎన్నికలలో మాదిరిగానే నిశబ్దంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని హటాత్తుగా ఎన్నికలకు వెళ్ళాలని కేసీఆర్‌ ఆలోచన కావచ్చు. కనుక సిఎం కేసీఆర్‌ ప్రతిపక్షాల కోసం ఎన్నికలకు ముందే ఓ పద్మవ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు అర్దమవుతోంది. మరి ఈ పద్మవ్యూహంలో అవి చిక్కుకొంటాయా లేక ఆయనే చిక్కుకొంటారా? అనేది ఎన్నికలు దగ్గర పడితే తెలుస్తుంది.