KCR -Telangana Budget 2019తెలంగాణాలో రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు. ఆర్ధిక శాఖ కూడా ఆయన వద్దే ఉండడంతో ఆయనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలంగాణాలో మొట్టమొదటి సారిగా ఒక ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య వంటి వారు ఇలా చేశారు. బడ్జెట్ లో రైతులకు, సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. ఇటీవలే జరిగిన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని వాగ్దానాలకు కేటాయింపులు చెయ్యడం విశేషం.

రైతుల కోసం: ఎన్నికల సమయంలో చెప్పిన ప్రకారం 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి ఇప్పటివరకు 8 వేలు ఇస్తుండగా ఇప్పుడు దానిని 10వేలకు పెంచారు, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది.

సంక్షేమం కోసం: సంక్షేమానికి ఈ బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికలు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను మొత్తాన్ని, రూ.1000 నుంచి రూ.2,116కు పెంచారు. దివ్యాంగుల పింఛనును రూ.2,000 నుంచి రూ.3,116కు పెంచారు. వృద్ధాప్య పింఛన్‌కు కనీస వయసు అర్హతను 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, పెంచిన పింఛను ఇవ్వబోతున్నారు. దీనికోసం 12,067 కోట్లు కేటాయించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.1450కోట్లు కేటాయించారు. కొత్తగా ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి కోసం రూ.1810కోట్లు కేటాయించారు. వివిధ కులాల కార్పొరేషన్లకు భారీగా కేటాయింపులు చేశారు.