Telangana Chief Minister KCR Announces Yet Another Good Schemeతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోతున్నారు. వచ్చేనెల 10న విశాఖలో ప్రారంభమయ్యే శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. గత నెల రోజులలో విశాఖ శారదా పీఠం కు కేసీఆర్ వెళ్ళడం ఇది రెండో సారి. ఇటీవలే తన ఫార్మ్ హౌస్ లో ఐదురోజుల పాటు సహస్ర చండీ యాగాన్ని శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి సారథ్యంలోనే జరిగింది.

గతంలో తెలంగాణ ఎన్నికల ముందు కేసీఆర్ తో రాజశ్యామల యజ్ఞం కూడా చేయించారు ఆయన.ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ వెళ్లి శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. సహజంగా ఆధ్యాత్మిక టూర్లలో కేసీఆర్ రాజకీయ వ్యాఖ్యలు చెయ్యరు కాబట్టి ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అయితే కేసీఆర్ ఏపీ వస్తున్న సమయంలో కొన్ని పక్షాలు చేసే హడావిడికి మాత్రం రాజకీయ రంగు పులుముకుంటుంది.

మరోవైపు అదే రోజున అమరావతిలో జరిగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి గృహప్రవేశానికి కేసీఆర్ ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇప్పటివరకు దాని గురించి అధికారికంగా ఎటువంటి వార్త రెండు వైపులా నుండీ రాలేదు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ లోకి రావాలని జగన్ ను కేటీఆర్ ఆహ్వానించారు. తొందరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ వచ్చి మిగతా విషయాలు మాట్లాడతారని అప్పట్లోనే కేటీఆర్, జగన్ చెప్పారు. ఆ రోజు చర్చలు జరుగుతాయని పుకార్లు వినిపిస్తున్నాయి