KCR Takes - Oathతెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో సరిగ్గా వేద పండితులు నిర్ణయించిన మధ్యాహ్నం 1.25కు ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను.. ’ అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఒకే ఒక్క మంత్రి ప్రమాణస్వీకారం చెయ్యడం గమనార్హం.

మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్‌ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ‌కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, తెరాస ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చెయ్యగానే జై తెలంగాణ నినాదాలతో ప్రాంగణం అంతా నిండి పోయింది. వచ్చే వారంలోగా కేసీఆర్ కేబినెట్ ను ఫైనల్ చేస్తారని సమాచారం.

దాదాపుగా 90 మంది గెలవడంతో ఈసారి కేబినెట్ నిర్ణయం కత్తి మీద సామే. అదే క్రమంలో చాలా మంది భారీ మెజారిటీతో గెలిచారు. పైగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో చాలా విషయంలో పరిగణలోకి తీసుకోవాలి. ఈ క్రమంలో ఆయన కొంత సమయం తీసుకోదలిచారు. రాజ్యాంగం ప్రకారం కేబినెట్ మంత్రుల సంఖ్య సభలోని పూర్తి సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. అంటే కేసీఆర్ టీమ్ లో 17 మంది మంత్రులు ఉండబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఖరారు కావడంతో కేటీఆర్, హరీష్ తప్పనిసరి అవ్వడంతో ఇంకో 13 మంత్రులకు మాత్రమే అవకాశం ఉంది.

అదే క్రమంలో ఖమ్మం లోని అవసరాల దృష్ట్యా ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావు కు మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఖమ్మంలో తెరాస పేలవమైన ప్రదర్శన చూపెట్టింది. అక్కడ కూడా పాగా వేసి ఉంటే 100 కొట్టడం తేలికయ్యేది. ఈక్రమంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఎలాగైనా ఖమ్మం స్థానాన్ని కైవసం చేసుకోవాలని గులాబీ దళపతి అభిప్రాయం. మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోవడంతో ఆయన స్థానంలో ఆయన తమ్ముడు కొడంగల్ లో రేవంత్ రెడ్డి పైన గెలిచిన పట్నం నరేంద్రకు అవకాశం ఇవ్వవచ్చని సమాచారం.