KCR Survey on Pawan Kalyan ఢిల్లీలో మీడియా మిత్రులతో జరిగిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో పలు విషయాలు చర్చించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, పలు సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఎంతవారినైనా ఉపేక్షించవద్దని అకున్ సబర్వాల్ కు పూర్తి స్వేఛ్చను కల్పించినట్లుగా కేసీఆర్ స్పష్టం చేయగా, ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలు ఎదురు చూస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాల పెంపు 2024 వరకు ఉండకపోవచ్చని చేసిన వ్యాఖ్యలు ‘జంప్ జిలానీ’ల ఆశలపై నీళ్ళు జల్లినట్లయ్యింది.

ఇక అత్యంత కీలకమైన మరో అంశం ఏమిటంటే… ఏపీ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా ఉండదని తనకు ఓ మిత్రుడు చెప్పినట్లుగా కేసీఆర్ మీడియా మిత్రులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి 45% ఓట్లు, టిడిపికి 43% ఓట్లు, బిజెపికి 2.6%, పవన్ కళ్యాణ్ జనసేనకు 1.26% ఓట్లు మాత్రమే రానున్నట్లుగా కేసీఆర్ చెప్పిన విషయం కీలకంగా మారింది.

ఒక రాజకీయ పార్టీని నడపడం అంత తేలికైన విషయం కాదని, గతంలో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ విషయంలో ఇది నిరూపణ అయ్యిందని, అందుకే పవన్ ప్రభావం పెద్దగా ఉండదని స్వయంగా కేసీఆర్ నోటి వెంట రావడం హైలైట్ గా మారింది. బహుశా ఇవే వ్యాఖ్యలు తెలంగాణా రాష్ట్రం గురించి చేస్తే, ఇందులో చర్చించడానికి ఏమీ ఉండదని చెప్పడంలో సందేహం లేదు. ఓ పక్కన ఏపీలో కాపులే బలమైన ఓటర్లుగా అభివర్ణిస్తూ… అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కు అంత సీన్ లేదని వ్యాఖ్యానించడం బహుశా కేసీఆర్ కే చెల్లిందని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ ‘జనసేన’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపధ్యంలో… కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వారికి మనోవేదనను కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే కేసీఆర్ చెప్పిన ఓట్ల శాతంలో వైసీపీకి ఎక్కువ ఇవ్వడం అనేది వర్తమాన పరిస్థితికి విరుద్ధంగా ఉందని, ఇది జగన్ – కేసీఆర్ ల ధృఢమైన బంధానికి ప్రతీకగా నిలుస్తుందే తప్ప ఇందులో వాస్తవం లేదని పవన్ అభిమానులతో పాటు, అధికార తెలుగుదేశం పార్టీ వర్గీయులు కూడా వీటిని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.