kcr speech at vikarabad public meetingతెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 8 ఏళ్ళలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి చూపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌. అయితే వడ్డించిన విస్తరిలా ఉన్న తెలంగాణను దక్కించుకొనేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తాను ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని బిజెపి వచ్చి గద్దలా తన్నుకుపోవాలని చూస్తోందని కేసీఆర్‌ ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. అది సహజమే. అనాడు రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆంద్రా ప్రజలు కూడా ఇలాగే బాధపడ్డారు.

కేసీఆర్‌ ఆవేదన, ఆందోళన నిన్న వికారాబాద్‌ బహిరంగసభలో స్పష్టంగా కనబడ్డాయి. తెలంగాణ ఏర్పడక మునుపు పరిస్థితులను, ఇప్పటి పరిస్థితులను ప్రజలందరూ బేరీజు వేసి చూసుకోవాలని హితవు పలికారు. అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, దేశంలో మరెక్కడా లేనన్ని సంక్షేమ పధకాలను కూడా రాష్ట్రంలో అమలుచేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు.

గుంటనక్కల వంటి బిజెపి నేతల మాయమాటలు నమ్మి బిజెపికి రాష్ట్రాన్ని అప్పగిస్తే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందని కనుక వారి మాయలో పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్రమోడీ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయకుండా కేవలం మాయమాటలతో కాలక్షేపం చేస్తున్నారని సిఎం కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ శత్రువు అని అన్నారు. కనుక ప్రజలు విచక్షణతో ఆలోచించి మళ్ళీ టిఆర్ఎస్‌కే అధికారం కట్టబెట్టాలని సూచించారు.

రాష్ట్ర ప్రజలు బిజెపి వైపు మొగ్గుచూపుతున్నారేమో అనే భయాందోళనల కేసీఆర్‌ మాటలలో స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక తన ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పుకొని, బిజెపి వైఖరిని ఎండగట్టి ప్రజలను టిఆర్ఎస్‌వైపు నిలుపుకోవడానికి ఆయన ప్రయత్నించినట్లు అర్దమవుతోంది.

ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నంలో ఆనాడు తాను ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి పొరాడి తెలంగాణ సాధించానని చెప్పుకొన్నారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత సిఎం కేసీఆర్‌ ఆంద్రా పాలకులు, వలస పాలకులు అంటూ మాట్లాడటం ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకే.

ఇంతకాలం తనకు ఎదురే లేదనుకొన్న సిఎం కేసీఆర్‌ ఇప్పుడు బిజెపి దూకుడు చూసి ఆందోళన చెందుతుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే సిఎం కేసీఆర్‌ ఏవిదంగా రకరకాల వ్యూహాలతో టిఆర్ఎస్‌ను గెలిపించుకొంటున్నారో, అదే విదంగా బిజెపి కూడా తనకు తెలిసిన విద్యలతో, తన శక్తియుక్తులతో తెలంగాణలో అధికారంలోకి చేజిక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కనుక దానినీ తప్పు పట్టలేము. మరి టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్న ఈ రాజకీయ ఆధిపత్య పోరులో ఏ పార్టీ గెలుస్తుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు.