kcr speech at munugode meeting about by-electionsతెలంగాణలో ఎప్పుడు ఉపఎన్నికలు వచ్చినా సిఎం కేసీఆర్‌ కేంద్రాన్ని, ప్రధాని నరేంద్రమోడీని బూచిగా చూపిస్తుంటారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో త్వరలో ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఇంకా ఎన్నికల గంట మ్రోగనేలేదు. కానీ సిఎం కేసీఆర్‌ శనివారం మునుగోడులో ఎన్నికల ప్రచారసభ నిర్వహించారు.

ఈ సభలో ఆయన వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని కానీ తాను రైతుల కోసం ససేమిరా అని మొండి పట్టుపడుతునాన్నని చెప్పారు. నదీ జలాల పంపకాలపై కేంద్ర ప్రభుత్వం తేల్చకపోవడం వలన ప్రాజెక్టులు కట్టుకోలేకపోతున్నామని, కృష్ణా నీళ్ళు వాడుకోలేకపోతున్నామని ఆరోపించారు.

రైతులకు సంక్షేమ పధకాలు ఇస్తుంటే కేంద్రం వద్దని చెపుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నిటినీ అమ్మిపడేస్తోంది రేపు మీ పొలాలను కూడా అమ్మేస్తుందేమో?అని సందేహం వ్యక్తం చేశారు. కనుక ప్రజలు చాలా ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు.

కనుక ఎన్నికల సమయంలో ఇతర పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మి తప్పుడు నిర్ణయం తీసుకొంటే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుందని హెచ్చరించారు. బిజెపి బలవంతంగా ఈ ఉపఎన్నికను తెలంగాణపై రుద్దిందని ఆరోపించారు.

కేసీఆర్‌ చెపుతున్నవన్నీ నిజమే కావచ్చు కానీ అవన్నీ ఉపఎన్నికకు, నియోజకవర్గానికి అసలు సంబందం లేని అంశాలు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా మాట్లాడాల్సి ఉండగా ఉపఎన్నికలతో ఎటువంటి సంబందమూ లేని కేంద్రాన్ని, ప్రధాని నరేంద్రమోడీని కేసీఆర్‌ బూచిగా చూపిస్తున్నారు! ఎందుకంటే బహుశః తెలంగాణ బిజెపిలో టిఆర్ఎస్‌కు సమ ఉజ్జీలైన నేతలు ఎక్కువమంది లేకపోవడం, ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకే అని చెప్పవచ్చు.

అయితే తెలంగాణ ఏర్పడకమునుపు ఏవిదంగా ఉండేది?ఇప్పుడు ఏవిదంగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు కనుక జాగ్రత్తగా ఆలోచించుకొని ఓట్లు వేయమని కేసీఆర్‌ కోరడం సమంజసంగా ఉంది. కానీ ఈ ఉపఎన్నికను బిజెపి బలవంతంగా తెలంగాణపై రుద్దిందనే కేసీఆర్‌ వాదన సహేతుకంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే, కేసీఆర్‌ ఉపఎన్నిక వద్దనుకొంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించకుండా పక్కన పెట్టించవచ్చు. గతంలో ఈవిదంగా చేశారు కూడా. కానీ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమోదించేశారు. అంటే కేసీఆర్‌ కూడా ఉపఎన్నికలను కోరుకొన్నారని, రాష్ట్రంలో రెచ్చిపోతున్న బిజెపికి ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపించుకొని తన సత్తా చాటుకోవాలని కోరుకొన్నారని అర్దమవుతోంది. కనుక ఈ ఉపఎన్నికల పాపంలో కాంగ్రెస్‌, బిజెపి, టిఆర్ఎస్‌ మూడింటికీ తలో పిడికెడు అని చెప్పుకోక తప్పదు.

ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరులో ఈ ఉపఎన్నికలు సెమీ ఫైనల్స్ వంటివని చెప్పక తప్పదు. కనుక రెండు పార్టీలు మద్య మునుగోడులో భీకరయుద్ధం తప్పదు. దానిని ప్రజలు భరించక తప్పదు.