Telangana-State-KCR-తెలంగాణ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు మూడడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌తో భోజన సమావేశమైనప్పుడు, వారి మద్య జాతీయ రాజకీయాలపై తప్పక చర్చ జరిగే ఉంటుంది. కానీ వారిద్దరూ మీడియాతో మాట్లాడినప్పుడు ఆ ఊసే ఎత్తలేదు! మోడీ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని వేధించడం సరికాదని, బిఆర్ఎస్ ఆమాద్మీకి అండగా ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూతురు కల్వకుంట్ల కవిత చిక్కుకోవడం, బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు రెండు కేసులు కేసీఆర్‌ తలపై కత్తుల్లా వ్రేలాడుతున్నాయి. కనుక జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేస్తే ఆ కేసులలో మళ్ళీ కదలికలు మొదలవుతాయి.

ఇదీగాక మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిని పట్టించుకోకుండా జాతీయ రాజకీయాలంటూ దేశం పట్టుకొని తిరిగితే మొదటికే మోసం రావచ్చు. అందుకే కేసీఆర్‌ స్పీడ్ తగ్గించుకొని, తెలంగాణ రాజకీయాలపైనే పూర్తిగా దృష్టి పెట్టి పనులు మొదలుపెట్టారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ గెలిచి, కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి చేపడితే అప్పుడు ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా చెల్లుతుంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా వింటారు. కనుక శాసనసభ ఎన్నికలలో గెలిచి, ఆ తర్వాత అంటే 2024 మార్చి-ఏప్రిల్లోగా జరిగే లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణతో సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కూడా బిఆర్ఎస్‌ పార్టీ పోటీ చేయవచ్చు. ఒకవేళ ఆయన అదృష్టం, ప్రయత్నాలు ఫలించి ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగితే, అప్పుడు కేసీఆర్‌ గ్రాండ్‌గా జాతీయ రాజకీయాలలో ప్రవేశించవచ్చు. అప్పటికి ఏ కూటమికి, పార్టీకి ఎన్నిసీట్లు ఉన్నాయో తేలిపోతుంది కనుక అవకాశం ఉంటే చక్రం తిప్పొచ్చు లేకుంటే కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి, 2029 వరకు కేసీఆర్‌ జాతీయ రాజకీయాలతో కాలక్షేపం చేయవచ్చు.

ఈ నెల 12న పాట్నలో బిజెపిని వ్యతిరేకిస్తూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనుకొంటున్న ప్రతిపక్షపార్టీలన్నీ సమావేశం కాబోతున్నాయి. పైన చెప్పుకొన్న కారణాలతో కేసీఆర్‌ ఆ సమావేశానికి దూరంగా ఉండవచ్చు.

ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలనే విషయం కేసీఆర్‌ తొందరగానే గ్రహించారని భావించవచ్చు. ఆయన జాతీయ రాజకీయాలంటూ దేశం పట్టుకొని తిరుగుతూ హడావుడి చేస్తుంటే, ఐ‌టి, ఈడీ, సీబీఐ దాడులతో తీవ్ర ఆందోళన చెందుతున్న బిఆర్ఎస్‌ నేతలకు ఇది చాలా సంతోషం కలిగించే విషయమే… కదా?