KCR Silence on Telangana Elections 2018--ఈ నెల 7వ తారీఖున తెలంగాణ పోలింగ్ లో పూర్తి అయ్యింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యి ఉంది. నేషనల్ మీడియా ఛానెళ్లన్నీ ముక్తకంఠంతో తెరాసకు ప్రజలు తిరిగి పట్టం కట్టడం ఖాయమని చెప్పాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఖచ్చితమైన సర్వేలకు పేరు పొందిన ‘ఆంధ్ర ఆక్టోపస్’ లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజల నాడి ప్రజకూటమికే అనుకూలంగా ఉందని చెప్పారు. దీనితో ప్రజకూటమి పార్టీలు వారు మద్దతుదారులు సంబరాలలో మునిగిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటినుండే చర్చలు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు.

అదే క్రమంలో తెరాస శ్రేణులు పూర్తిగా అయోమయంలో పడిపోయారు. ఓటమిని నమ్మలేకపొతున్నారు అదే క్రమంలో లగడపాటి సర్వేను తీసిపారేయలేకపోతున్నారు. ఈ సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వారిని భయపెడుతున్నారు. 7వ తారీఖున ఓటు వేశాక మీడియాతో మాట్లాడిన ఆయన మళ్ళీ తిరిగి మీడియా ముందుకు రాలేదు. పూర్తిగా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. ఇప్పటికి వరకు కేటీఆర్, మరో ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వారు పెద్ద కాన్ఫిడెంట్ గా మాట్లాడినట్టు అనిపించలేదు.

కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు వెళ్లి బయట ప్రపంచం తో సంబంధం లేకుండా ఉండిపోవడం కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఉద్యమ సమయంలోనూ ఆయన తరచుగా చేసే పని ఇది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఆయన మౌనం తెరాస క్యాడర్ ని భయపెడుతుంది. 2014 ఎన్నికల పోలింగ్ పూర్తి అవ్వగానే కేసీఆర్ సాయంత్రం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అధికారంలోకి వస్తున్నాం అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు అప్పట్లో. రెండో విడత సీమాంధ్రలో జరిగే పోలింగ్ లో జగన్ గెలుపు ఖాయమని చెప్పారు అది వేరే విషయం.

అయితే అప్పట్లో తెలంగాణ ఫలితాలు మాత్రం కేసీఆర్ చెప్పినట్టుగానే వచ్చాయి. ఇప్పుడు ఆయన మౌనం తెరాస శ్రేణులను పూర్తిగా అయోమయానికి గురి చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా లేకపోవడంతో దానిని వాడుకుందాం అనే ఉద్దేశంతోనే కేసీఆర్ శాసనసభను ఎనిమిది నెలల ముందు రద్దు చేశారు. ఒకవేళ తెరాస ఈ ఎన్నికలలో ఓడిపోతే మాత్రం అది చారిత్రక తప్పిదం అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఒకవేళ ఈ ఫలితాలు తేడాగా వస్తే మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా వ్యతిరేకంగానే వస్తాయి.