KCR -Telangana Elections 2018మొన్న ఆ మధ్య తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓడిపోతే నాకు పెద్దగా నష్టమేమి లేదు… ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా అని అనడం సంచలనం సృష్టించింది. కేసీఆర్ నోట మొట్టమొదటి సారిగా ఓటమి అనే మాట రావడం సంచలనమే. దీనితో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపుపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఒకప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పిన కేసీఆర్ నోట ఓటమి అనే మాట వినబడటం చాలా మందికి అర్ధం కాలేదు.

ఇప్పుడు కేసీఆర్ నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టినట్టుగా కనిపిస్తుంది. వికారాబాద్‌ జిల్లా తాండూరులో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతూ తెరాస విజయం ఖాయమని కేసీఆర్‌ అన్నారు. తాజా సర్వే ప్రకారం.. తెరాస 100 స్థానాల్లో కాదు 103 నుంచి 106 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికలనగానే నేతలు వస్తుంటారు.. వెళ్తుంటారని, ఓటర్లు గందరగోళానికి గురికావొద్దని సోనియా గాంధీని ఉద్దేశిస్తూ హితవు పలికారు.

103 సీట్లు గెలుస్తుంది అని అనుకున్న మజ్లీస్ పార్టీకి కచ్చితంగా గెలిచే 7-8 సీట్లు ఉన్నాయి. అంటే ప్రతిపక్ష పార్టీలు అన్నిటికి కలిపి… కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ జన సమితి, టీడీపీ, వామపక్షాలకు 10 సీట్ల లోపే వస్తాయని కేసీఆర్ అంచనా. దీనిలో నిజమెంతో డిసెంబర్ 11న తెలియబోతుంది. డిసెంబర్ 7న తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నాయి. అదే నెల 11న ఫలితాలు విడుదల అవుతాయి.