kcr said black mailed my daughter forced to change party తెలంగాణ సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరిగింది. హటాత్తుగా ఈ సమావేశం నిర్వహిస్తుండటంతో కేసీఆర్‌ ఏదో సంచలన నిర్ణయం ప్రకటించబోతున్నారని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. అంత సంచలనం కాకబోయినా చాలా ఆసక్తికరమైన నిర్ణయాలే కేసీఆర్‌ ప్రకటించారు.

ఈసారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకి వెళ్తున్నామని, కనుక ముందస్తు ఊహాగానాలను పట్టించుకోవద్దని చెప్పారు. టిఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. అది విని ఆనందంతో ఉబ్బితబ్బిబైన ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు.

ఈసారి కూడా టిఆర్ఎస్‌ పార్టీయే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాబోతోందని పలు సర్వేలతో స్పష్టం అయ్యిందని కేసీఆర్‌ చెప్పారు. శాసనసభ ఎన్నికలకి మరో 10 నెలల సమయం మాత్రమే ఉన్నందున ఇప్పటి నుంచి అందరూ ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ దగ్గరయ్యేందుకు కృషి చేయాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి ప్రజలకు వివరిస్తూ, అర్హులైన వారిలో ఎవరికైనా పధకాలు అందకపోతే వారికి ఇప్పించాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయసమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రజలతో బలమైన సంబంధాలు ఏర్పరచుకొనేందుకు గట్టిగా కృషి చేయాలని కేసీఆర్‌ సూచించారు. ప్రజలతో బలమైన సంబంధాలున్నప్పుడే ప్రజాప్రతిధులు మళ్ళీ మళ్ళీ ఎన్నికవగలుగుతారని కేసీఆర్‌ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐ‌టిలతో మంత్రులు, ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగతీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోందని చెపుతూ చివరికి తన కూతురు, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కూడా బిజెపిలో చేరాలని తీవ్రంగా ఒత్తిడి చేశారనే కొత్త విషయం కేసీఆర్‌ ఈ సమావేశంలో బయటపెట్టడంతో టిఆర్ఎస్‌ నేతలందరూ షాక్ అయ్యారు. తన కూతురు కేంద్రం ఒత్తిళ్ళకు తలొగ్గలేదు కనుకనే ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరికించిఉండవచ్చని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఈడీ, సీబీఐ, ఐ‌టి శాఖల దాడులకు భయపడవ్వద్దని, ఏం జరుగుతుందో చూద్దామని కేసీఆర్‌ అందరికీ ధైర్యం చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించి జైల్లో ఉన్న ముగ్గురు నిందితుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని కనుక ఇంక ఆ విషయం గురించి కూడా పార్టీలో ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని కేసీఆర్‌ చెప్పారు. పార్టీలో అందరి దృష్టి మరో 10 నెలల్లో జరుగబోయే ఎన్నికలపైనే ఉండాలని, అందరూ కలిసికట్టుగా ఎన్నికలని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలలో ఏవిదంగా బలమైన వ్యూహాలతో ముందుకు వెళ్ళి విజయం సాధించామో వచ్చే ఎన్నికలలో కూడా అలాగే దూసుకుపోయి ముచ్చటగా మళ్ళీ విజయం సాధించి అధికారంలో కొనసాగుదామని సిఎం కేసీఆర్‌ చెప్పారు.