kcr trs party warangal elections result‘తెలంగాణా రాష్ట్ర సమితి’ ఏర్పాటు అనేది తెలంగాణా సాధన కోసమే గానీ, అధికారం కోసం కాదు అని, ఆ పార్టీ స్థాపించిన తొలినాళ్ళల్లో వ్యవస్థాపకుడు కేసీఆర్ తెలిపారు. దానికి తగిన విధంగానే ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమించారు. అంతే కాదు, తెలంగాణా ఏర్పాటు అయితే, ఓ దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానంటూ పిలుపునిచ్చారు. అయితే కాలక్రమేణా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటులో రాజకీయ అవసరాలు గుర్తించిన కేసీఆర్, ఉద్యమ పార్టీకి రాజకీయ హంగులు అద్దారు. అ తర్వాత కేసీఆర్ ఆశించిన తెలంగాణా ఆవిర్భావం, తొలి ముఖ్యమంత్రిగా తానే ప్రమాణ స్వీకారం చేయడం వడివడిగా జరిగిపోయింది. గత 16 మాసాలుగా కేసీఆర్ పాలనలో తెలంగాణా రాష్త్రం ఉంది.

ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో కేసీఆర్ చేసిన ప్రకటనలకు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న పాలనకు పొంతన లేదనేది పొలిటికల్ వర్గాల భావన. అందుకనే ఒక్కప్పుడు కేసీఆర్ కు అండగా నిలిచిన కోదండరాం వంటి వారు ప్రస్తుతం సిఎం విధానాలతో విభేదిస్తున్నారని, అలాగే ప్రజా సంఘాలు కూడా కేసీఆర్ వ్యవహార శైలితో విసుగెత్తిపోయారనే టాక్ తెలంగాణాలో బలంగా వినపడుతోంది. మరో వైపు రాజకీయంగా తనకు ఎదురు లేకుండా చూసుకోవడంలో కేసీఆర్ ఇప్పటికే “ఆపరేషన్ ఆకర్ష్” పేరిట టిడిపి, కాంగ్రెస్ నాయకులను లాగేసుకున్నారు. దీంతో రాజకీయంగా కంటే, ఒక ఉద్యమంగా కేసీఆర్ ను ఎదుర్కోవాలని బిజెపి సీనియర్ నేత ఎన్నం శ్రీనివాసరెడ్డి భావించారు.

గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసారు. “బచావో తెలంగాణా” పేరుతో జరుగుతున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎన్నం, తన భవిష్యత్తు కార్యాచరణను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానని, అయితే ఏ రాజకీయ పార్టీలో మాత్రం ఖచ్చితంగా చేరబోనని తేల్చి చెప్పారు. ఒకప్పుడు ఏ విధానాలతో అయితే కేసీఆర్ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారో, అదే ఉద్యమ విధానాలను తానూ అవలంబించబోతున్నానని ఎన్నం శ్రీనివాసరెడ్డి పరోక్ష సంకేతాలు ఇచ్చారు.