KCR-Revanth-Reddy-Bandi-Sanjayఈ ఏడాది అక్టోబర్‌ నవంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి ఈసారి ఎలాగైనా బిఆర్ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి తహతహలాడుతుంటే, కర్ణాటక ఎన్నికల ఊపుతో తెలంగాణలో కూడా గెలిచేయవచ్చని కాంగ్రెస్‌ గట్టి నమ్మకంతో ఉంది.

అయితే వాస్తవ పరిస్థితి ఏమిటంటే, తెలంగాణలో బిజెపి పైకి చాలా శక్తివంతంగా ఉన్నట్లు కనబడుతుంటుంది కానీ దాని వద్ద పోటీ చేసేందుకు సరిపడా అభ్యర్ధులే లేరు. ఉన్నా వారిలో అతికొద్ది మంది బిఆర్ఎస్ నేతలను ఎదుర్కొని నిలబడగలరు. అందుకే నయన్నో, భయాన్నో ఇతర పార్టీల నేతలను బిజెపిలో చేర్చుకొనేందుకు ఈటల రాజేందర్‌ విఫలయత్నాలు చేసి చేతులెత్తేశారు.

అయితే కేంద్రంలో మళ్ళీ బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా తెలంగాణలో అధికారంలోకి రాలేదని అందరూ గట్టిగా నమ్ముతుండటం వలననే బహుశః ఎవరూ బిజెపిలోకి చేరడంలేదేమో? ఈ కోణంలో ఆలోచించాల్సిన బిజెపి అధిష్టానం ఇవేమీ పట్టించుకోకుండా ఉత్తరాది ఫార్ములానే తెలంగాణలో కూడా గుడ్డిగా అమలుచేయాలని ప్రయత్నిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారు.

ఉత్తరాదిలో మోడీ భజన చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకోవచ్చు కానీ దక్షిణాది రాష్ట్రాలలో స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్ధిక అంశాలతో పాటు, అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి కూడా ప్రజలకు నమ్మకం కల్పించాల్సి ఉంటుంది. బిజెపి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్ వంటి రొటీన్ అంశాలతో ప్రజలను పలకరిస్తోంది.

అయితే కర్ణాటక విజయంతో కదం తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానిక సమస్యలు, అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. కనుకనే ప్రజలతో కనెక్ట్ కాగలుగుతోంది. ఉదాహరణకు ధరణి పోర్టల్ వలన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్‌ నేతలు గట్టిగా మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ధరణిని పక్కన పడేస్తామని చెపుతున్నారు. ఇది వారు ఆశించిన సత్ఫలితం ఇస్తుందో బెడిసికొడుతుందో తెలీదు కానీ కాంగ్రెస్‌ నేతలు స్థానిక అంశాలతో ప్రజల మద్యకు వెళుతున్నారని స్పష్టం అవుతోంది.

ఇక కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వరుసగా రెండుసార్లు బిఆర్ఎస్‌ అధికారంలో ఉంది కనుక, దానిని మార్చేయాలని ప్రజలు అనుకోవడం సహజం. అందుకు కేసీఆర్‌ పాలనను, అభివృద్ధి సంక్షేమ పధకాలను ఎవరూ తప్పు పట్టరు కానీ, కాంగ్రెస్‌, బిజెపిలు హైలైట్ చేస్తున్న అవినీతి, అక్రమాలు, కుటుంబపాలన, కేసీఆర్‌ నిరంకుశత్వం వంటివి బిఆర్ఎస్‌కు నష్టం, కాంగ్రెస్‌ బిజెపిలకు లాభం కలిగించవచ్చు.

ఏది ఏమైనప్పటికీ, ఈ ఎన్నికలలో కూడా గెలవకపోతే మరో 5 ఏళ్ళపాటు కాంగ్రెస్‌, బిజెపిలు ప్రతిపక్షంలో మనుగడ సాగించడం చాలా కష్టం కనుక ఈ ఎన్నికలే వాటికి చివరి ఎన్నికలన్నట్లు పోరాడటం ఖాయమే. కనుక జరుగబోయేది కురుక్షేత్ర మహా సంగ్రామమే అని భావించవచ్చు.