KCR-Responds-on-TRS-MLA-Poaching-తెలంగాణ సిఎం కేసీఆర్‌ నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి మోడీ, అమిత్‌ అమిత్‌ షా ద్వయం తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏవిదంగా కుట్రలు పన్నిందో వివరించారు. బిజెపి తరపున వచ్చిన రామచంద్ర భారతి, నందు కుమార్, సింహయాజీ అనే ముగ్గురు వ్యక్తులు తమ నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఫామ్‌హౌస్‌లో ఏవిదంగా వ్యవహారం నడిపించారో తెలియజేస్తూ ఓ వీడియో రికార్డును మీడియాకు విడుదల చేశారు.

ఇప్పటి వరకు తాము 8 ప్రభుత్వాలను కూల్చివేశామని తర్వాత తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్‌ ప్రభుత్వాలను కూడా కూల్చేయబోతున్నామని నిందితులు చెప్పారని కేసీఆర్‌ తెలిపారు. కేరళకు చెందిన తుషార్, బిజెపికి చెందిన సంతోష్ ఈ వ్యవహారాన్ని అమిత్‌ షా స్థాయికి తీసుకువెళ్లి నడిపించారని కేసీఆర్‌ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షా కనుసన్నలలో ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయని కేసీఆర్‌ ఆరోపించారు.

నిందితుల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకొన్న సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, ఇంకా ఫామ్‌హౌస్‌లో రికార్డు చేసిన ఆడియో, వీడియోలను దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రతిపక్ష పార్టీల నేతలందరికీ పంపించబోతున్నామని కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కనుక అందరూ కలిసి కాపాడుకోవడానికి ముందుకు రావాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టడానికి వెనకాడనని కేసీఆర్‌ అన్నారు.

కేసీఆర్‌ మాటలు విన్నప్పుడు మహాకవులు శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రిల గురించి సాహితీలోకం చెప్పుకొనే ఓ మాట గుర్తొస్తుంది. ప్రపంచంలో అందరి బాధలు తనవనుకొంటూ శ్రీశ్రీ కవితలు వ్రాస్తే, తన (మనసులో మెదిలే భావనలు) బాధలే లోకుల బాధలనుకొన్నట్లు దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు వ్రాసేవారట! కేసీఆర్‌ కూడా దేవులపల్లివారిలా తన కష్టాలను యావత్ లోకానికి వచ్చిన కష్టంగా భావించమని కోరుకొంటున్నారిప్పుడు.

తెలంగాణ సిఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిల ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసుకొని ఆ పార్టీలను నిర్వీర్యం చేస్తున్నప్పుడు కేసీఆర్‌కు తప్పుగా అనిపించలేదు… ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు. రాష్ట్రంలో, శాసనసభలో ప్రతిపక్షాల గొంతులు అణచివేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు.

2019 ఎన్నికలలో ఏపీలో టిడిపిని ఓడించేందుకు వైసీపీతో కలిసి కుట్రలు చేసినప్పుడు కేసీఆర్‌కి తప్పుగా అనిపించలేదు. ప్రజాస్వామ్యం గుర్తురాలేదు. కానీ ఇప్పుడు తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర జరుగుతోంది కనుక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అందరూ తనకు అండగా నిలబడాలని కేసీఆర్‌ కోరుకొంటున్నారు!

జగన్ ప్రభుత్వాన్ని కూడా కూల్చివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కేసీఆర్‌ బయటపెట్టి మళ్ళీ సిఎం జగన్మోహన్ రెడ్డిని తన బిఆర్ఎస్‌ సేనలో చేర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు. అయితే కేసీఆర్‌ చెపుతున్నవేమీ కొత్త విషయాలు కావు. బిజెపి నేతలే స్వయంగా ఆ విషయం చెప్పుకొంటున్నారు. తమ తదుపరి టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే అని బహిరంగంగానే చెపుతున్నారు. నీవు నేర్పిన విద్యాయే నీరజాక్షి అన్నట్లు కేసీఆర్‌ వద్ద నేర్చుకొన్న విద్యలని ఆయన మీదే ప్రయోగిస్తున్నారు. అయితే కేసీఆర్‌కి అడ్డంగా దొరికిపోయారు అంతే!

ఒకవేళ కేసీఆర్‌ మొదటి నుంచి ప్రజాస్వామ్యానికి కట్టుబడి పరిపాలన చేస్తున్నట్లయితే నేడు తప్పకుండా అందరూ ఆయనకు సంఘీభావం తెలిపేవారు. కానీ ప్రజాస్వామ్యం ఇతరులకే తప్ప తనకు వర్తించదని భావిస్తుంటారు కనుకనే విశ్వసనీయత కోల్పోయారు. అయితే మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఈ వంకతో జగన్ ఆయనతో చేతులు కలుపుతారా లేక మోడీ, అమిత్‌ షా, బిజెపి పెద్దలకు విధేయంగా ఉంటూ తన ప్రభుత్వాన్ని కాపాడుకొంటారా?అంటే రెండోదే చేస్తారని చెప్పవచ్చు.