KCR responds on farmers loan waiverతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం గోల్కొండలో పోలీసు వందనం స్వీకరించి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన ఒక మాట ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తమ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు హామీ ఇచ్చిన విధంగా ఒక లక్ష రుణమాఫీ చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దీనిపై రైతులు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.

హామీల అమలు లో గత టర్మ్ లో కేసీఆర్ నిజాయితీగా వ్యవహరించారు. అయితే ఈ సారి అంత నిజాయితీ కనిపించలేదు. కొంతమేర ఆర్ధిక ఇబ్బందులు కూడా ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. రుణమాఫీ జోలికి ఇప్పటి వరకు పోలేదు. దీనితో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కొత్త అప్పులు పుట్టడం లేదు అదే సమయంలో ఖాతాలలో పడిన రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకులు తమ అప్పులు కింద జమ చేసేసుకుంటున్నాయి. అప్పుల మీద వడ్డీలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

దీనితో అన్నదాతల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రుణమాఫీ చేసేసాం అని చెప్పుకోవడం వారికి రుచించడం లేదు. అయితే తెలంగాణ లో ప్రతిపక్షాల అరుపులు వినపడే అవకాశమే లేకుండా ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని అందలం ఎక్కించారు. దీనితో కేసీఆర్ కు పెద్దగా ఈ విమర్శల వల్ల ఇబ్బంది లేదనే భావించవచ్చు. అయితే జాతీయ పతాకం నీడలో ఉండి అసత్యాలు పలకడమనేది కొంచెం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.