KCR privatises 50% Telangana State RTCతెలంగాణ కేబినెట్ దాదాపుగా నాలుగు గంటలు చర్చించిన అనంతరం తెలంగాణ ఆర్టీసీలోని 5100 రూట్లు ప్రైవేటు పరం చెయ్యాలని నిర్ణయించింది. మొత్తం 10,400 రూట్లలో ఇది 49%. నవంబర్ 5 అర్ధరాత్రి లోపు కార్మికులు యూనియన్లను కాదనుకుని విధుల్లో చేరాలని లేని పక్షంలో మిగతా రూట్లను కూడా ప్రైవేటు పరం చెయ్యడానికి వెనుకాడమని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

అయితే ముఖ్యమంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రైవేటును అనుమతించడం అంటే ఆర్టీసీని చంపెయ్యడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. “ప్రైవేటీకరణ చెయ్యడం గొప్ప ఏముంది? ఎవడైనా చెయ్యగలడు. దేశానికి దిశా నిర్దేశం చెయ్యగలనని డెబ్బై ఏళ్లుగా దేశాన్ని పాలించిన వాళ్లకి విజన్ లేదని చెప్పిన కేసీఆర్ ఆర్టీసీని గాడిలో పెట్టలేకపోయినట్టే కదా?,” అని అంటున్నారు.

“ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల బాట పట్టిస్తే నిజంగానే కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. దేశాన్ని ముందుకు నడిపించగల నాయకుడు అని అందరితోనూ అనిపించుకునే వారు. ప్రైవేటు పరం చేసి చేతులు దులుపుకోవడం ఏముంది గొప్ప? 48,600 కార్మికుల కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది,” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం అనేది జరగని పని అని కేసీఆర్ మరోసారి చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా ఆర్టీసీ సమ్మె ఈరోజు 30వ రోజుకు చేరింది. ముఖ్యమంత్రి ఆఖరి డెడ్ లైన్ కారణంగా సమ్మె ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి.