KCR, Prashant Kishor, Telanganaతెలంగాణ సిఎం కేసీఆర్‌ కేవలం ఏడున్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చేసి చూపారు. అదేవిదంగా యావత్ దేశాన్ని కూడా అభివృద్ధిచేసి చూపుతానని చెపుతూ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలలో చిత్తశుద్ది ఎంతుంది?అసలు వాటి వెనుక మర్మం ఏమిటి?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంతకాలం కాంగ్రెస్‌, బిజెపిల వల్లనే తెలంగాణతో సహా యావత్ దేశం ఇటువంటి దుస్థితిలో ఉందని, కనుక ఆ రెండు పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. అయితే ఆయనే స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలను టిఆర్ఎస్‌లోకి ఆహ్వానించి పదవులు కట్టబెట్టారు! నేటికీ బిజెపి ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలను చేర్చుకొంటూనే ఉన్నారు. ఆ రెండు అసమర్ధ, అవినీతి పార్టీలని భావిస్తున్నప్పుడు ఆ పార్టీలు నడిచేది వారితోనే కదా? అటువంటి వారిని ఎందుకు టిఆర్ఎస్‌లో చేర్చుకొంటున్నట్లు?వారిని పక్కన పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్‌, బిజెపిలను దేశం నుంచి తరిమికొడతానని చెప్పడం ఏమిటి?

ఇక సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటున్నారు. అయితే ఆయన మిత్రుడు, ఆయనతో కలిసి పనిచేయబోతున్న ప్రశాంత్ కిషోర్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీని ఏవిదంగా గెలిపించాలో ఆ పార్టీ అధిష్టానానికి చెప్పడమే కాకుండా ఆ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ పక్క ఆయన కాంగ్రెస్ పార్టీకి పని చేస్తూ, తెలంగాణలో టిఆర్ఎస్‌ పార్టీ కోసం సర్వేలు నిర్వహించి మొన్న శనివారం సిఎం కేసీఆర్‌ను కలిసి నివేదిక సమర్పించడం విశేషం. అంటే ఆయన తెలంగాణలో టిఆర్ఎస్‌ కోసం పనిచేస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారా?

ఆయన వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకు రావాలనుకొంటున్నప్పుడు, కాంగ్రెస్‌, బిజెపిలను అడ్డుకొనేందుకు సిఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయబోయే థర్డ్ ఫ్రంట్ కోసం ఎలా పనిచేస్తారు? ప్రశాంత్ కిషోర్‌ ఒకవేళ కేసీఆర్‌ కోసం పనిచేస్తారనుకొంటే కాంగ్రెస్‌ పార్టీని టిఆర్ఎస్‌తో జత కట్టించక తప్పదు. అప్పుడు రాష్ట్రస్థాయిలో కూడా కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ పొత్తులు తప్పవు. ఇందుకు కేసీఆర్‌ సిద్దపడితే, దేశాన్ని భ్రష్టు పట్టించిందన్న కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకొని సిఎం కేసీఆర్‌ ప్రజల ముందుకు ఏవిదంగా వెళ్ళగలరు?