KCR Pragathi Bhavan Coronavirus తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఏరికోరి కట్టించుకున్న ప్రగతి భవన్ ఇప్పుడు కరోనా దాటికి వణుకుతుందని సమాచారం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం ప్రకారం.. వారం రోజుల్లో దాదాపుగా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతిభవన్‌ను శానిటైజేషన్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉండడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. రాజధాని ప్రాంతంలో కరోనా విజృంభించడంతో సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అక్కడ నుండే కీలక సమీక్షలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… మొన్న ఆ మధ్య కరోనా ని అదుపుచెయ్యడానికి జీహెచ్ఎంసి ఏరియాలో మళ్ళీ లాక్ డౌన్ విధించాలని కూడా కేసీఆర్ ఆలోచన చేశారు. అయితే దానివల్ల వచ్చే ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెనక్కు తగ్గారు. ఇది ఇలా ఉండగా నిన్న ఒక్కరోజే తెలంగాణాలో 1,213 కేసులు నమోదు అయ్యాయి.

దీనితో రాష్ట్రంలోని మొత్తం కేసులు 18,570కు చేరాయి. టెస్టు చేస్తున్న ప్రతీ నాలుగు సాంపిల్స్ లో ఒకటి పాజిటివ్ గా తేలడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. తెలంగాణలోని కేసులలో 75% పైగా జీహెచ్ఎంసి ఏరియా నుండి నమోదు అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 275 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.