KCR says Chandrababu naidu is my friendదేశంలోని ఏ ఒక్క నేత చేయలేని పనిని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారు. చట్టసభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట సరికొత్త రీతిలో ప్రసంగించిన కేసీఆర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా నదులు, ప్రాజెక్ట్ లు, నీటి నిల్వలపై సుదీర్ఘ ప్రసంగం చేసారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు మిత్రుడేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు.

‘చంద్రబాబును తాను చేసిన మహాయాగానికి ఆహ్వానించానని, ఈ సందర్భంగా ఆయన భోజనం పెట్టారని, ఆ తరువాత ఆయనతో మాట్లాడుతూ, బతుకు, బతకనియ్ అనేది తెలంగాణ ప్రజల సంప్రదాయమని ప్రజలను మభ్యపెడదామంటే కుదరదని చెప్పానని సభలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాలు జియోగ్రాఫికల్ గా పక్కనే ఉన్నాయని, తోసేస్తే వెళ్లిపోయే రాష్ట్రాలు కాదని అన్న చంద్రబాబు, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉందామని, గోదావరి నది నుంచి 900 టీఎంసీల నీరు తీసుకుంటామని అన్నారని గోదావరి నదీ జలాలపై ప్రసంగించిన సమయంలో మాట్లాడారు.

కంప్యూటర్ పరిజ్ఞానంలో అసమాన ప్రతిభ గడించిన ఓ టెక్కీ స్థాయిలో కేసీఆర్ కంప్యూటర్ తెర ముందు కూర్చుని, మౌస్ చేతబట్టి ఆయా అంశాలను సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా వివరించారు. ఓ పక్క కంప్యూటర్ తెరపై ఆయా అంశాల ప్రస్తుత పరిస్థితిని చూపిస్తూ ఆ అంశాలకు ఉన్న ప్రాధాన్యతను తన వాక్చాతుర్యంతో కేసీఆర్ వివరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.