T MLAs, the highest paid lawmakers in country!హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమను మరో మెట్టు పైకి తీసుకెళ్ళడానికి మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగరమంతా పేపర్ పని లేకుండా, కేవలం కంప్యూటరీకరణ ద్వారానే పనులన్నీ సాగాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. మొత్తమ్మీద పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో కేటీఆర్ ముందు వరుసలో ఉన్నారు. తాజాగా అదే విధానాన్ని కేసీఆర్ కు అలవరుస్తున్నారని తెలంగాణా పొలిటికల్ వర్గాలు అంటున్నాయి.

ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ ఇవ్వనున్న 3డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ అందులో భాగమేనన్న టాక్ వినపడుతోంది. అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర జలవిధానంపై 3డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు శ్రీకారం చుట్టారు. గూగుల్ ఎర్త్ సాయంతో దాదాపు మూడున్నర గంటల పాటు తెలంగాణ జల విధానాన్ని సమగ్రంగా వివరించనున్నారు. ఇందుకు సంబంధించి మొత్తం మూడు స్క్రీన్లను అసెంబ్లీలో ఏర్పాటు చేశారు. ఒకటి స్పీకర్ ముందు, రెండోది అధికారపక్ష సభ్యుల ముందు, మూడో స్క్రీన్ ను విపక్ష సభ్యుల ముందు ఉంచారు. అలాగే శాసనమండలిలో సభ్యుల కోసం మరో స్క్రీన్ ను ఏర్పాటు చేశారు.

మొత్తం 108 పవర్ పాయింట్ స్లైడ్స్ ను జిల్లాల వారీగా ప్రాజెక్టులు, తాగునీటికి ఉన్న అవకాశాలను వివరిస్తారు. ముఖ్యంగా 1956 నుంచి 2016 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్టులెన్ని, ఎన్ని టీఎంసీల నీరు వినియోగించే విధంగా వాటిని కట్టారు, మహారాష్ట్ర, గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న ఇతర రాష్ట్రాల్లో ఎన్ని వందల ప్రాజెక్టులు కట్టారు… తెలంగాణలో ఎందుకు కట్టలేకపోయారనే విషయాలు చర్చకు రానున్నాయి. హెలికాఫ్టర్ల ద్వారా తీసినటువంటి చిత్రాలు, కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థల సర్వే వివరాలతో ఈ ప్రజెంటేషన్ జరగనుంది. అయితే ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.