KCR Politics from farm houseఒకప్పుడు తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి వెళ్తే… ప్రతిపక్షాలు ఘోరంగా విమర్శించేవి. ఇప్పుడు పంథా మారింది. కేసీఆర్ రెండో సారి బంపర్ మెజారిటీతో గెలిచాకా ఆయనను అనగలిగే వారే లేరు. ప్రజలే మాకు సచివాలయం నుండి పని చేసినా పర్లేదు ఫార్మ్ హౌస్ నుండి చేసినా పర్లేదు అని చెప్పడంతో ఆ వాదనలకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు అధికార పార్టీ నేతలు, తెరాస అనుకూల మీడియాలో ఫార్మ్ హౌస్ కు కొత్త భాష్యం మొదలు పెట్టాయి.

ఇప్పటికే తెలంగాణ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటింది. కేబినెట్ విస్తరణ లేదు. విమర్శించే వారు లేకపోగా అధికార పార్టీ నేతలు, తెరాస అనుకూల మీడియాలు కేసీఆర్ ఫార్మ్ హౌస్ కేబినెట్ విస్తరణపై ఏకాంత మథనం చేస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ కు ఆ ఏకాంతం ప్రగతి భవన్ లో గానీ సచివాలయంలో గానీ దొరకదా? అప్పుడైనా ఇప్పుడైనా ఫార్మ్ హౌస్ ఒక్కటే. అప్పుడు బ్రహ్మరాక్షసి కాదు ఇప్పుడు అక్కడ మంత్ర దండమూ లేదు. సమయాన్ని బట్టి వాడేస్తున్నారంతే.

తాజగా ఈ నెల 16న కేబినెట్ విస్తరణ జరగొచ్చని అంటున్నారు. ఇప్పటికి ఇటువంటి వార్తలు ఎన్నో విన్నాం… వచ్చిన తారీఖులు వచ్చినట్టు పోయాయి. ఈసారి ఏమవుతుందో చూడాలి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఈనెల 17న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. కేసీఆర్‌ జీవిత నేపథ్యాన్ని తెలిపే భారీ ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం అప్పటికైనా కేబినెట్ కొలువు దీరుతుందేమో చూడాలి.