KCR political heir KTRఊహించని సంఘటనలు జరిగినపుడు వాటితో పాటు వివాదాలు కూడా చుట్టుముడతాయి. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఏకచ్చత్రాధిపత్య విజయం కూడా అలాంటిదే. బయటకు ఎన్ని గంభీర ప్రకటనలు చేసినప్పటికీ బహుశా ఈ విజయాన్ని టీఆర్ఎస్ వర్గాలు కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలన్నీ కేటీఆర్ కు అప్పగించడంతో, సాధారణంగా కేటీఆర్ పేరు రాజకీయ మరియు మీడియా వర్గాల్లో మారుమ్రోగుతోంది. దీంతో కేసీఆర్ ‘వారసత్వం’ అన్న పదానికి తెరలేపారు కేసీఆర్ తనయురాలు కవిత.

కేసీఆర్ తర్వాత పార్టీలో అత్యంత అనుభవజ్ఞుడిగానూ, అటు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగానూ హరీష్ రావు పేరు ఎప్పుడూ వినపడుతుంది. నెంబర్ 2 స్పాట్ అనేది టీఆర్ఎస్ లో ఉంటే అది హరీష్ రావుదేనని ప్రత్యేకంగా ఎవరూ చెప్పలేనంతగా రాజకీయ వర్గాల్లో హరీష్ తన ముద్రను చూపించారు. అయితే కేటీఆర్ రంగ ప్రవేశంతో టీఆర్ఎస్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కేసీఆర్ తర్వాత అన్నీ తానై కేటీఆర్ చొరవ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కేటీఆర్ – హరీష్ రావుల మధ్య విబేధాలు తలెత్తాయని పొలిటికల్ వర్గాల్లో జరిగిన ప్రచారం తెలిసిందే.

అయితే తమ మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవని, అంతా పార్టీ కోసం, తెలంగాణా అభివృద్ధి కోసమే కష్టపడుతున్నామని బయటకు ఎన్ని చెప్పినా అంతర్లీనంగా రాజకీయ ఎత్తుగడలు అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో నిజామాబాద్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలు… పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఒక సందేశాన్ని పంపినట్లయ్యింది.

“కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ను ప్రజలే ఆమోదించారని” పరోక్షంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఎలాంటి అర్ధాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాగూ పరోక్షంగా చెప్పారు కాబట్టి రేపు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే ‘మీడియా వక్రీకరించిందనే’ డైలాగ్ ఎలాగూ ఉంటుంది కదా! ఇదే సందర్భంలో హరీష్ రావును శాంతపరిచే వ్యాఖ్యలు కూడా చేసి తన రాజకీయ చాణక్యతను చాటుకున్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నో సార్లు పార్టీకి హరీష్ రావు చిరస్మరణీయ విజయాలను అందించారని ఆమె పేర్కొన్నారు.

అంటే ఇక్కడ కవిత చేసిన వ్యాఖ్యలు “బాహుబలి” సినిమాలో ప్రభాస్ ను రాజుగా, రానాను సైన్యాధిపతిగా ప్రకటించినట్లు ఉంది కదూ..! అంటూ పోల్చడం నెటిజన్ల వంతయ్యింది. అయినా విజయం సాధించిన వేళ “వారసత్వం” తెరపైకి తేవడమంటే దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ వ్యాఖ్యలు పలికింది కవితే అయినా… పలికించింది మాత్రం మరొకరున్నారనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి.