KCR Plans to increase power charges and property taxes (1)తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఆగమేఘాల మీద పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీనితో ఇప్పట్లో ఎటువంటి ఎన్నికలు లేకపోవడంతో ప్రజలపై వడ్డనలు మొదలు పెట్టే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం.

ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. విద్యుత్‌ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. పేదలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతామని వెల్లడించారు. అభివృద్ధి చెందాలంటే పన్నులు పెంచక తప్పదన్నారు.

బాగా స్తోమత వున్న వారి మీద ఇంకా పన్నులు వేస్తాము అన్నారు. అభివృద్ధి చెందాలంటే పన్నులు పెంచక తప్పదు అన్నప్పుడు ఈ ఆరు సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎలా ప్రకటించుకునే వారు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి.

ఒకపక్క తమ ప్రభావం పెంచుకోవడానికి ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రకటించేసి, ఇప్పుడు అభివృద్ధి కావాలంటే పన్నులు పెంచాల్సిందే అని చెప్పుకోవడం గమనార్హం. రైతు బంధు పేరుతో 100 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు పంచేసి డబ్బులు లేవు, ఆర్ధిక మాంద్యం అంటూ బీద అరుపులు అరవడం ఏంటో అని పలువురు విమర్శిస్తున్నారు.