KCR plan has failed what will they do nowతెలంగాణలో బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు బిజెపి ప్రతినిధులు అడ్డంగా దొరికిపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ చేతికి భలే ఆయుధమే దొరికింది. దాంతో విచారణ పేరుతో బిజెపి పెద్దలకి నోటీసులు ఇస్తూ చాలా హడావుడి చేశారు. అయితే బిజెపి పిలక కేసీఆర్‌ చేతికి చిక్కిన్నట్లు చిక్కి జారిపోయింది.

ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో నేడు ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (దర్యాప్తు బృందం) ఆ కేసుని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదని కనుక దీనిని సీబీఐకి అప్పగించాలని కోరుతూ ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్‌కి హైకోర్టు నేడు ఆమోదం తెలిపింది. ఆ కేసుకి సంబందించి సిట్ సేకరించిన సమాచారనంతా సీబీఐకి అప్పగించాలని ఆదేశిస్తూ నేడు తీర్పు చెప్పింది.

ఇంతకాలం ఆ కేసు దర్యాప్తు పేరుతో కేంద్రానికి ఇరుకున పెడుతున్న కేసీఆర్‌ చేతిలో నుంచి కేంద్రం కనుసన్నలలో పనిచేసే సీబీఐ చేతిలోకి వెళ్ళిపోవడంతో, ఈ మహాసంగ్రామంలో కేసీఆర్‌ హటాత్తుగా నిరాయుధుడిగా మిగిలిపోయినట్లు అయిపోయింది. ఇప్పుడు ఈ కేసు సీబీఐ చేతిలోకి వచ్చేస్తోంది కనుక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌కి అడ్డంగా దొరికిపోయి జైల్లో పడిన ముగ్గురు బిజెపి ప్రతినిధులని కేంద్రం అవలీలగా విడిపించుకోగలదు.

ఇదే సమయంలో కేంద్రం చేతిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఆదాయపన్ను కేసులో మంత్రి మల్లారెడ్డి, గ్రానైట్ కుంభకోణం కేసులో మంత్రి గంగుల కమలాకర్, బిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు, మత్తుమందుల కేసులో బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు చిక్కుకొని ఉన్నారు. కనుక ఈ కేసులతో ఇప్పుడు కేంద్రం కేసీఆర్‌ మీద పైచేయి సాధించిన్నట్లయింది.

కనుక కేసీఆర్‌ మళ్ళీ కేంద్రంపై కత్తి దూసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోక తప్పదు. ఒకవేళ కేసీఆర్‌ ఏమాత్రం తొందరపడి అడుగు ముందుకు వేసినా వెంటనే ఆ కేసులలో కదలిక వస్తుంది. అందరూ సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను కార్యాలయాల ముందు విచారణ పేరుతో చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అదే కనుక జరిగితే వారందరూ కేసీఆర్‌ మీద ఒత్తిడి పెంచడం ఖాయం. ఆ కేసులలో నుంచి కేసీఆర్‌ తమను బయటపడేయకపోతే వరుసగా బిజెపిలో చేరిపోయి ‘ఆత్మరక్షణ’ చేసుకోవచ్చు.

కనుక ఇల్లాలకాగానే పండగ కాదన్నట్లు ఢిల్లీలో బిఆర్ఎస్‌ జెండా ఎగరేసి వచ్చినంత మాత్రన్న పండగ చేసుకోలేమని కేసీఆర్‌ గ్రహించే ఉంటారు. కనుక కేసీఆర్‌ కేంద్రంతో రాజీ పడతారా లేక కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు కేంద్రాన్ని లొంగదీసుకొనేందుకు మరో కొత్త అస్త్రాన్ని పైకి తీస్తారా?చూడాలి.