kcr personal invitation to pawan kalyanఈ నెల 23 నుంచి 27 వ తేదీ వరకు తెలంగాణా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి చండీ యాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదలుకొని, దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యులతో పాటు, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు అన్ని ప్రముఖ రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తున్నారు.

అంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ యాగానికి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందుతుందా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పవన్ – కేసీఆర్ ల మధ్య ప్రత్యక్ష రాజకీయ వైరం పెద్దగా లేనప్పటికీ, పరోక్ష విబేధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరి వాటన్నింటినీ పక్కనపెట్టి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పవన్ ను ఆహ్వానిస్తారా? ఒకవేళ ఆహ్వానం అందితే, పవన్ హాజరవుతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

“తనకు సిద్ధాంతపరమైన విబేధాలే తప్ప, ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు ఉండవని” ఇటీవల కూడా పవన్ ప్రకటించారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ ను ప్రశంసించారు కూడా! రాబోతున్న గ్రేటర్ ఎన్నికలలో ‘జనసేన’ పోటీ చేయడం లేదని ఇప్పటికే తేల్చడంతో… హైదరాబాద్ లోని సెటిలర్ల ఓట్లను ఆకర్షించేందుకైనా పవన్ ను కేసీఆర్ ఆహ్వనిస్తారనే ప్రచారం పొలిటికల్ వర్గాల్లో బలంగా వినపడుతోంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగి… కేసీఆర్ ఆహ్వానించి, పవన్ హాజరైన పక్షంలో… పవన్ పై ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీకి తలమానికం అయినటువంటి అమరావతి శంకుస్థాపనకు హాజరు కాకుండా కేసీఆర్ యాగానికి హాజరు కావడంపై పవన్ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని విశ్లేషకుల మాట. ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి కేసీఆర్ – పవన్ ల కలయిక పై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.