KCR Operation Akarsh for MLC voting
తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఐదు ఖాళీలకు నాలుగు గెలిచే సంఖ్యాబలం ఉంది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు అభ్యర్థులను ప్రకటించి, ఐదో సీటు మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించారు. హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాఠోడ్‌, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం పేర్లను సీఎం శుక్రవారం ప్రకటించారు.

ఎంఐఎం తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే ఐదో అభ్యర్థిని గెలిపించుకోవడానికి తెరాసకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం కావాలి. దీనితో అధికార పక్షం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అవకాశం ఉంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేల సపోర్టు లేకుండా కేసీఆర్ పోటీకి ముందుకు రారు. దీనితో తెలంగాణలో మరో రౌండ్ ఆపరేషన్ ఆకర్షకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 25న నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఎమ్మెల్యే కోటా కింద అయిదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరో 8 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని గెలిపించుకోలేక పోతే మండలి నుండి ఆ పార్టీ మాయం అయిపోతుంది. ఇప్పటికే 2015 నుండి టీడీపీకి మండలిలో స్థానం లేకుండా పోయింది. దీనితో అసలు మండలిలో ప్రతిపక్షమే లేకుండా అయిపోతుంది.